- సెంటిమెంట్ పేరుతో దోచుకున్నరు
- హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్
- కాళేశ్వరానికి అదనంగా రూ.60 వేల కోట్లు ఖర్చుపెట్టారని ఫైర్
- పిల్లలకు చదువును దూరం చేస్తున్నరు: ఆకునూరి మురళి
- పంటబీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణే అని విమర్శ
మహబూబ్‌నగర్, వెలుగు : రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ గా సీఎం కేసీఆర్ మార్చారని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఫైరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ‘జాగో తెలంగాణ’ పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒరిజినల్ ఎస్టిమేషన్ రూ.40 కోట్లని చెప్పారని, కానీ, రూ.60 వేల కోట్లు అదనంగా ఖర్చు చేశారని మండిపడ్డారు. ఆ నిధులనే విద్య, వైద్యం కోసం ఖర్చు చేసి ఉంటే తెలంగాణ బాగుపడేదన్నారు.
‘‘రాష్ట్రంలోని చాలా బడుల్లో టీచర్లు లేరు. హాస్పిటల్స్‌లో డాక్టర్లు లేరు. యూనివర్సిటీల్లో వందల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. వీటన్నింటి గురించి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి” అని చంద్రకుమార్ అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి మాట్లాడుతూ దేశంలో 35 పాలిత ప్రాంతాలు ఉంటే వాటిలో విద్యా ప్రమాణాలు పాటించని రాష్ర్టాల్లో తెలంగాణ 34వ స్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ చేతకానితనమే ఇందుకు కారణమని ఆయన ఫైరయ్యారు. విద్యా శాఖపై ఇప్పటి వరకు ఎందుకు రివ్యూ చేయలేదో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘పిల్లలను విద్య నుంచి దూరం చేయడమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తున్నది.
ప్రజలు చదువుకుంటే ప్రశ్నిస్తారనే భయం ఆయనలో ఉంది. తన కొడుకు, మనుమడు, ముని మనువళ్లు కూడా అధికారం సాగించాలనే దురుద్దేశంతో విద్యా వ్యవస్థను సీఎం ఆగం పట్టించాడు. అలాగే రాష్ర్టంలో 65 లక్షల మంది రైతులు ఉంటే, 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. సీఎంకు కౌలు రైతులు కనిపిస్తలేరు. వారికి పంటరుణం ఇవ్వడం లేదు. బీమా, నష్టపరిహారం, సబ్సిడీలు వర్తింపజేయడం లేదు. 28 రాష్ర్టాలలో పంట బీమాలేని ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే” అని ఆకునూరి పేర్కొన్నారు. కొన్ని రాష్ర్టాల్లో ఆయా ప్రభుత్వాలు సొంతంగా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నాయని, మరికొన్ని రాష్ర్టాల్లో ఫసల్ భీమా యోజన అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కానీ, తెలంగాణలో ఏ స్కీంనూ అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇదేంటని ప్రశ్నిస్తే ‘రైతుబంధు’ ఇస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
ఇప్పటి వరకు రూ.72 వేల కోట్లు ‘రైతుబంధు’ కింద ఇచ్చామని రాష్ర్ట ప్రభుత్వం చెప్పుకుంటోందని, కానీ అందులో రూ.28 వేల కోట్లు రైతులుకాని వ్యక్తుల అకౌంట్లలో జమచేశారని ఆయన ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో 35 లక్షల మంది నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఆయన ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పాలమూరు, గద్వాల జిల్లాల్లో రూ.2 లక్షలకు ఇండ్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.ఈ సమావేశం అనంతరం ‘తెలంగాణలో అవినీతి, ఆర్థిక దోపిడీ, రాజకీయాలను ఓడిద్దాం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పాలమూరు అధ్యయన కన్వీనర్ రాఘవాచారి, ప్రొఫెసర్లు వినాయక్‌రెడ్డి, స్కైబాబా, ఖలీఫా తదితరులు పాల్గొన్నారు.