బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వారంలో బీసీ రిజర్వేషన్ల చట్టం : జస్టిస్​ ఈశ్వరయ్య

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వారంలో బీసీ రిజర్వేషన్ల చట్టం : జస్టిస్​ ఈశ్వరయ్య
  • తమిళనాడు తరహాలో ఒకే చట్టం తేవాలి: జస్టిస్​ ఈశ్వరయ్య
  • రిజర్వేషన్లపై కవితకు అవగాహన లేక మూడు చట్టాలంటున్నరు
  • ముస్లిం, సర్వే లోపాల నెపంతో ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్​కు బీసీల కు న్యాయం చేయాలనే చిత్తశుద్ది ఉంటే వారం రోజుల్లోపే బీసీల రిజర్వేషన్ల బిల్లు.. చట్ట రూపుదాల్చుతుందని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఈ అంశాన్ని ముస్లిం బీసీలు, ఎన్యూమరేషన్ లోపాల నెపంతో ప్రతి పక్షాలు రాజకీయం చేయొద్దని హితవు పలికారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోనూ తమిళనాడు తరహాలో విద్యా, ఉద్యోగ సర్వీసులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలుపై సమగ్రమైన చట్టం తేవాల్సి ఉందన్నారు. 

కులగణన పూర్తయిన తర్వాత.. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్లపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, అనంతరం రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చేలా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఉభయ సభల్లో పెట్టి చట్టం రూపంలోకి తేవాలన్నారు. అప్పుడు ఏ కోర్టు ఆ చట్టాన్ని కొట్టివేయలేదని వివరించారు.

1992లో తమిళనాడులోనూ ఇలాంటి ప్రక్రియే జరిగిందని.. అనంతరం దీనిపై తొమ్మిది తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా 1994లో రిజర్వేషన్లను ఆ రాష్ట్రం చట్టం చేసిందని వివరించారు. ప్రస్తుతం అక్కడ వెనకబడిన వర్గాలు 69 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయన్నారు. తమిళనాడు తర్వాత తెలంగాణలో ఇలాంటి చట్టం వస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. బీసీల మిత్ర పక్షాలు ఇది చేస్తాయని దీనిపై అనుమానం అక్కర్లేదన్నారు. 

కవితవి తిరకాసుపెట్టే మాటలు

రిజర్వేషన్లపై అవగాహన లేక ఏదో తిరకాసు పెట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడు తున్నారని జస్టిస్​ ఈశ్వరయ్య ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ సర్వీసులకు సంబంధించి మూడు చట్టాలు చేయాలని ఆమె మాట్లాడం సరికాదన్నారు. అంటే మూడు చట్టాలు తెస్తే.. మూడు సార్లు చట్టం చేసి కేంద్రానికి పంపాలా? రాష్ట్రపతి ఆ చట్టాలను ఆమోదించాలా? అని ప్రశ్నించారు. తమిళనాడులో విద్య, ఉద్యోగాలకు సంబంధించి ఒకే చట్టం ఉందన్నారు. తమిళనాడు ప్రజల్లో చైతన్యం ఉన్నందున లోకల్ బాడీల్లో వాళ్లు రిజర్వేషన్లు పెట్టుకోలేదని చెప్పారు. 

మొత్తం 69 శాతంలో రిజర్వేషన్లలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 1 శాతం ఉందన్నారు. వీటితోపాటు జనరల్ ​సీట్లంటిలో కూడా సీట్లలో బీసీలే గెలుస్తారన్నారు. తమిళనాడులో 31 పార్లమెంట్ స్థానా లు ఉండగా.. 29 స్థానాల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు చెరో స్థానాన్ని దక్కించుకుంటారని చెప్పారు. అలాగే పీజీ మెడికల్ సీట్లలో ప్రభుత్వం తెచ్చిన జీవోలతో బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేసినట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వివరించారు.