- ఇండియా కూటమికి మద్దతుగా బీసీల చార్జ్ షీట్
- కులగణన చేయకుండా బీజేపీ అడ్డుపడుతున్నది
- మండల్ కమిషన్ సిఫార్సులు అమలుకాకుండా కుట్ర చేసిందని ఫైర్
- బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం
- ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లు పెంచకుండా, కులగణన చేయకుండా అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిన బీజేపీని గద్దె దించాలని నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఆలిండియా బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. తాను బీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీకి బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. బీసీల సమస్యలపై ప్రధానిని కలిసి అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఆర్ఎస్ఎస్ ఆమోదం లేకుండా ఓబీసీల సమస్యలను పరిష్కరించే దమ్మూ ధైర్యం మోదీకి లేదన్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇండియా కూటమికి బీసీలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు?’ అనే అంశంపై నాలుగు పేజీల చార్జ్ షీట్ ను విడుదల చేశారు. ఇందులో కులగణన చేయకపోతే బీసీలకు జరిగే నష్టం, బీజేపీ, ఇండియా కూటమి మేనిఫెస్టోల మధ్య తేడాలు, బీసీ రిజర్వేషన్ల చరిత్ర, వాస్తవాలు అనే అంశాలు పొందుపరిచారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు కాకుండా గతంలో బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. బీసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి సిద్ధంగా ఉందని తెలిపారు. బీసీల డిమాండ్లు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న ఇండియా కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ‘‘బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చినట్టే ఇచ్చి బీజేపీ నాయకులతో పదవులన్నీ భర్తీ చేశారు. బీసీలకు తమ హక్కులు అందకుండా చేస్తున్నారు. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేక భావం ఉంది. మొదటి నుంచి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ.. ఈసారి అధికారంలోకి వస్తే వాటిని పూర్తిగా రద్దు చేయాలని చూస్తోంది. ఇప్పటికైనా ఓబీసీలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై బీసీ వ్యతిరేక బీజేపీని ఓడించి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలి” అని కోరారు.
బీసీలను ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు: జాజుల
బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత పదేండ్ల బీజేపీ పాలన బీసీలకు చీకటి రోజులని, బీసీల ఆకాంక్షలు నెరవేర్చని బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ‘‘రిజర్వేషన్లు పెంచాలని బీసీలు అడుగుతుంటే, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని మోదీ చెప్పడం ఎంతవరకు సమంజసం. ముస్లింల నోటికాడి ముద్ద గుంజి బీసీలకు పెట్టడం ఎందుకు? బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ మేరకు ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు.
రెండ్రోజులకు ఒకసారి రాష్ర్ట పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బీసీ రిజర్వేషన్లపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. కులగణనపై బీసీలకు ఎందుకు హామీ ఇవ్వడం లేదన్నారు. బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీ కోల్పోయిందని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాల రిజర్వేషన్లు తగ్గించి, అగ్రకులాల రిజర్వేషన్లు పెంచాలని బీజేపీ చూస్తోందని ఫైర్ అయ్యారు.
బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ, బీసీలకు బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరిస్తూ బీసీల చార్జ్ షీట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలకు కోటి లేఖలు రాశామన్నారు. బీసీ ఎజెండానే తమ ఎజెండాగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కుటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మీటింగ్ లో బీసీ సంఘాల నేతలు చిన్న శ్రీశైలం యాదవ్, విక్రమ్ గౌడ్, మహేష్ యాదవ్, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇండియా కూటమి మేనిఫెస్టో
- కులగణన, బీసీ రిజర్వేషన్లు పెంపు
- రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత
- కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు
- మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా అమలు
- జనాభా దామాషా ప్రకారం ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు రిజర్వేషన్లు
- కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి నిధులు
- బీసీలకు ప్రత్యేక బడ్జెట్
- బ్యాంకులతో నిమిత్తం లేకుండా బీసీలకు స్వయం ఉపాధి
బీజేపీ మేనిఫెస్టో
- కులగణనపై ఎలాంటి హామీ లేదు
- బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రస్తావన లేదు
- రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత్తపై ప్రకటన లేదు
- కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖపై హామీ లేదు
- మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా లేదు
- కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి నిధులు
- విశ్వకర్మ యోజన ద్వారా 15 బీసీ కులాలకు ఒక లక్ష బ్యాంక్ గ్యారంటీతో రుణాలు