రాజ్యాంగ సవరణతోనే.. బీసీ కులాలకు న్యాయం

బ్రిటిష్ ప్రభుత్వం1921లో కమ్యూనల్ జీవోను జారీ చేస్తూ, ప్రతి14 సీట్లలో ఆరు వర్గాలైన బ్రాహ్మణులకు 2 శాతం, బ్రాహ్మణేతర హిందువులకు 6 శాతం, వెనుకబడిన హిందువులకు 2 శాతం, హరిజనులకు 2 శాతం, ఆంగ్లో ఇండియన్లు, ఇండియన్ క్రైస్తవులకు 1 శాతం, ముస్లింలకు1 శాతం మెడికల్ సీట్ల భర్తీలో, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించింది. మద్రాస్ రాష్ట్రంలోని ప్రజలను ఆరు గ్రూపులుగా వర్గీకరించి జనాభా దామాషా పద్ధతిలో జనరల్ సీట్లు లేకుండానే అందరికీ రిజర్వేషన్లు కల్పించారు. స్వాతంత్ర్యం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మద్రాస్ రాష్ట్రంలో రిజర్వేషన్ల వ్యతిరేకులు కమ్యూనల్ జీవోను మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. విచారించిన హైకోర్టు జీవో రాజ్యాంగబద్ధం కాదని కొట్టేసింది. మద్రాస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కమ్యూనల్ జీవో చెల్లుబాటుపై మద్రాస్ హైకోర్టు కొట్టివేతను సుప్రీం సమర్థించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని ఇతరులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించకూడదని తేల్చి చెప్పింది. దీంతో మద్రాస్​సహా దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనలు మొదలయ్యాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేస్తూ, ఆర్టికల్ 15(4)ను చేర్చి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(బీసీ/ఓబీసీ) వారికి కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు అవకాశం కల్పించింది. 

50 శాతం మించకూడదనే నిబంధన

జనతాదళ్​ ప్రభుత్వం 1990లో మండల కమిషన్ నివేదిక అమల్లో భాగంగా ఆర్టికల్స్ 15 (4), 16 (4 ) ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడుతూ ఉత్తర్వులను జారీ చేసింది. అవి రాజ్యాంగ విరుద్ధమని తెలుపుతూ రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇంద్ర సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అని తెలిపింది. ఓబీసీ కులాల్లోని క్రిమీలేయర్ (సంపన్న శ్రేణి) వర్గాలను రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలని తీర్పునిచ్చింది. బీసీ/ఓబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు కావని, రాజ్యాంగంలో తెల్పిన ప్రకారం ఇవి వెనుకబడిన తరగతులు/వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లని, కేంద్ర ఓబీసీ జాబితాలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలను చేరుస్తున్నారు కాబట్టి, రిజర్వేషన్ల అమలులో క్రిమీలేయర్ నిబంధనలు పెట్టాలని సూచించింది. అలాగే వర్టికల్ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, ఒకవేళ 50 శాతం రిజర్వేషన్లు మించాలంటే వెనుకబడిన కులాలకు సంబంధించిన ఆమోదయోగ్యమైన లెక్కలు ఉండాలని నిబంధన విధించింది.

సుప్రీం తీర్పు

కేంద్ర ప్రభుత్వం 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 243 చేరుస్తూ, స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్​ల్లో వెనుకబడిన పౌరులకు రిజర్వేషన్ల కల్పనకు అవకాశం కల్పించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2010లో సుప్రీంకోర్టు కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో అనేక అంశాలు పేర్కొంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయి బీసీ కమిషన్ ద్వారా వెనుకబడిన పౌరుల జనాభా లెక్కలు తీయాలని, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను ప్రత్యేక బీసీ కులాల జాబితా ద్వారా గుర్తించి విద్యా, ఉద్యోగాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్ల కులాల జాబితాను, స్థానిక సంస్థల్లో అమలు చేయాల్సిన వెనుకబడిన పౌరుల జాబితా వేరుగా ఉండాలని తెలిపింది. 2022లో సుప్రీంకోర్టు కూడా సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్య జరిగిన కేసు తీర్పులో అదే విషయం చెప్పింది. రాజ్యాంగంలోని ప్రభుత్వ ఉద్యోగ, విద్యా రంగానికి సంబంధించిన అధికరణలైన 340, 15(4), 15(5), 338బి, 342ఏ, 366 లోని 26(సీ)లలో వెనుకబడిన కులాలను కాస్త, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా తెలిపారు. అదే స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్టికల్ 243లో బీసీ కులాలను వెనుకబడిన పౌరులుగా తెలిపారు. రాజ్యాంగంలోని ఈ లోపాలు నేడు బీసీ కులాలకు శాపంగా మారింది. కులస్వామ్య భారతదేశంలో బీసీ కులాలే లేవని రాజ్యాంగం చెబుతున్నది. కాబట్టి జనాభా లెక్కల్లో బీసీ కులాలను లెక్కించడం లేదు. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణతోనే సాధ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి.

ఓబీసీలకు 27 శాతం

మొదటి రాజ్యాంగ సవరణ తర్వాత వెనుకబడిన కులాల వారికి దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ ఉత్తర భారత దేశంలోని బీహార్ వంటి రాష్ట్రాలు సుమారు 1970 నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో అనేక న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటూ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో1993 నుంచి మండల కమీషన్ తీర్పు ఆధారంగా ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఉత్తర భారత దేశంలో బీహార్ మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు1993 తర్వాత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. అందుకే నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల ప్రాతినిధ్యం అన్ని కేటగిరీల్లో కలిపి 21 శాతానికి మించలేదు. 


–కోడెపాక కుమార స్వామి,రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం