టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు, జైలు, బెయిల్.. సినిమా సూపర్ హిట్. ఈ వ్యవహారంలో పోలీసులు నడిపిన కథ, కోర్టు ఇచ్చిన క్లైమాక్స్ బంపర్ హిట్. కేవలం 24గంటల వ్యవధిలోపునే సెలెబ్రిటీ అల్లు అర్జున్ అరెస్టు కావడం, పోలీసుల విచారణను ఎదుర్కోవడం, జైలుకు వెళ్లడం, బెయిల్ పై హీరోగా బయటికి రావడం అంతా పుష్ప 2 ప్రీమియర్ షోను తలదన్నేదిగా ఉంది.
హైదరాబాద్ సంధ్య థియేటర్లో పుష్ప2 సినిమా చూడటానికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో హైడ్రామా చోటు చేసుకుంది.
పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ రోజంతా విరామం లేకుండా పనిచేశాయి. ఆగమేఘాల మీద అర్జున్ను ఇంటికి పంపించడానికి పోలీస్, న్యాయ వ్యవస్థలు ఉరుకులు పరుగులు తీశాయి. ఒక కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తే, ఆ వెంటనే మరో ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చేసింది. మొత్తం మీద ఆ సెలెబ్రిటీని సగౌరవంగా ఇంటికి పంపించాయి. ఈ వ్యవహారంలో మరో గమ్మత్తు చోటు చేసుకుంది.
ఏ ఒక్కరి ష్యూరిటీ లేకుండానే, ఒక్క పైసా జమ చేయకుండా, కేవలం రూ. 50 వేల బాండ్ పేపర్ మాత్రమే రాసి ఇవ్వడంతోనే మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇలాంటి వెసులుబాటు సామాన్యులకు అసాధ్యం అని న్యాయవాదులు అంటున్నారు. మొత్తానికి న్యాయస్థానాల్లో కూడా సెలెబ్రెటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అని భావించే పరిస్థితి కనిపిస్తోంది.
కోర్టుల్లో లక్షలాది కేసులు
అల్లు అర్జున్ అరెస్టు అనంతరం.. ఒక సెలెబ్రెటీని అరెస్టు చేస్తారా? జైలుకు పంపుతారా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించే గొంతుకలు సామాన్యుడి విషయంలో కూడా గొంతు కలిపితే బాగుండేది. దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థ ఈ స్థాయిలో కాకున్నా.. అంతో ఇంతో నిబద్ధతతో సామాన్యుల విషయంలోనూ వ్యవహరిస్తే జైళ్లలో ఎంతోమంది ఏండ్ల తరబడి మగ్గి ఉండే పరిస్థితి ఉండేది కాదు.
కోర్టుల్లో లక్షలాది కేసులు ఉండేవి కాదు. చట్టం, ధర్మం నాలుగు పాదాలపై నడుస్తున్నాయా అన్న ప్రశ్నకు సరైన సమాధానం వచ్చుండేది. చట్టం కొందరికి చుట్టంగా మారి, అధికారం ఉన్నవారికి దాసోహం చేస్తున్నంత కాలం న్యాయం, ధర్మం సామాన్యుడి దరికి చేరబోవనే నానుడికి అల్లు అర్జున్ అరెస్టు ఒక ఉదంతంగానే పరిగణించవలసి ఉంటుంది.
సంధ్య థియేటర్ వ్యవహారంలో అరెస్టయిన వారందరి విషయంలో పోలీసులు, న్యాయవ్యవస్థ ఇదేవిధంగా వ్యవహరించకపోవడం కూడా గమనార్హం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే ప్రచారంలో వాస్తవం ఈసమెత్తైనా లేదన్నది ఈ సంఘటనతో తేటతెల్లమవుతోంది. బెయిలుకు అర్హత ఉండి కూడా, విడిపించేవారు లేక లక్షలాది మంది జైళ్లలోనే ఉండిపోతున్నారు.
ఆ విధంగా జైళ్లలో మగ్గుతున్నవారికి ధనం, పరపతి, కులం, హోదా, మతం, ప్రాంతం, అధికారం ఏవీ కూడా దరి చేరడం లేదు. ఇవన్నింటిలో ఏ ఒక్కటి అండగా నిలబడలేకపోతున్నాయి. అందుకే చట్టం వారికి చుట్టం కాలేకపోతున్నది. దేశంలోని కోర్టుల్లో దాదాపు నాలుగున్నర కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల్లో ఏ ఒక్క వ్యవస్థ కూడా వేగంగా నిర్దిష్టంగా తమ ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నాయి.
లక్షలాది మంది జైళ్లలో..
సామాన్యులు కావడం, పరపతి లేకపోవడం, అండదండలు ఆమడదూరంలో కూడా కనిపించకపోవడంతో లక్షలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో పోలీసులు, న్యాయ వ్యవస్థ ఎంతవేగంగా పని చేసిందో దేశప్రజలంతా ఆసక్తిగా ఉత్కంఠగా చూశారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన ఈ హైడ్రామా రాత్రి 12 గంటలకే ముగియడం సామాన్యులకు ఒకింత ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ, కథ నడిపినవారికి అదేమంత ఆశ్చర్యం అనిపించకపోవచ్చు. గంటల వ్యవధిలోనే పోలీసు విచారణను ఎదుర్కొని జైలును చూసి, బెయిలును ముద్దాడటం.. పుష్ప హీరోకే సాధ్యమైంది.
అల్లు అర్జున్ నిజంగానే అదృష్టవంతుడు. ఆయన ఒక సెలెబ్రెటీ కావడం వల్లనే అన్ని వ్యవస్థలు కాలుకు బలపం కట్టుకొని పరుగులు తీశాయి. సామాన్యుడి విషయంలో కూడా పాలన, న్యాయవ్యవస్థ ఇంతకాకున్నా ఇంతలో కొంతైనా వేగంగా పనిచేస్తే జైళ్లు కిక్కిరిసి ఉండేవికావు. న్యాయస్థానాల్లో కోట్ల సంఖ్యలో కేసులు
పెండింగ్లో ఉండేవే కావు. సామాన్యుడికి ఒక న్యాయం, సంపన్నుడికి ఒక న్యాయం అన్నట్లుగా అల్లు అర్జున్ అరెస్టు, విడుదల అంశం తెరమీదికి వచ్చింది.
న్యాయవ్యవస్థ, పాలకులు, కార్యనిర్వాహకులు సామాన్యుల పట్ల కూడా నిబద్ధతతో వ్యవహరించడం ద్వారానే కోర్టులలో కేసుల సంఖ్య తగ్గుతుంది. జైళ్లలో మగ్గుతున్నవారు జన జీవన స్రవంతిలో కలిసే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో న్యాయం, ధర్మం సామాన్యుడికి ఆమడ దూరం అనే అపఖ్యాతి కొనసాగడం తథ్యం.
- కొలను వెంకటేశ్వరరెడ్డి, రిటైర్డ్ ఎస్పీ, జైళ్లశాఖ-