- ఆరేడు రోజులు ఇక్కడే ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ
- అధికారులతో పాటు మేధావులు, నిపుణులతోనూ భేటీ
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్న జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. ఆరేడు రోజులపాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేయనున్నట్టు తెలిసింది. 12వ తేదీ వరకు ఆయన రాష్ట్రంలోనే ఉండనున్నట్టు సమాచారం. తొలుత అధికారులతో జస్టిస్ ఘోష్ భేటీ అవుతారని తెలిసింది. వారి దగ్గర్నుంచి మరికొంత సమాచారాన్ని తీసుకున్న తర్వాత.. మేధావులు, నిపుణుల నుంచి కూడా ప్రాజెక్ట్‌పై ఒపీనియన్స్ సేకరించే అవకాశాలున్నాయి. అనంతరం రెండు మూడు రోజులు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను జస్టిస్ ఘోష్ పరిశీలించనున్నట్టు తెలిసింది. ఫీల్డ్అధికారులను పిలిచి బ్యారేజీ స్వరూపాన్ని తెలుసుకుంటారు.
బ్యారేజీ కట్టినప్పటి నుంచి కుంగిపోయేదాకా జరిగిన క్రొనాలజీకి సంబంధించిన అంశాలను జస్టిస్ ఘోష్ ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. చాలా టెక్నికల్ అంశాలు ఉండటంతో వాటి గురించి మరింత లోతుగా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యారేజీ కుంగడానికి బాధ్యులైనవారినీ పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత నెల 25న రాష్ట్రానికి వచ్చిన ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సెక్రటరీలు, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏల ప్రైమరీ రిపోర్టులతోపాటు పలు ఫైళ్లను అధికారుల నుంచి తీసుకున్నారు. ఇప్పటికే పబ్లిక్ ఒపీనియన్లు, సాక్ష్యాలను తీసుకునేందుకు సర్కారు ద్వారా బహిరంగ ప్రకటన కూడా ఇప్పించారు.
మూడు నాలుగు రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్?
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ విచారణ చేస్తున్నది. పలుమార్లు రాష్ట్రానికి వచ్చిన చంద్రశేఖర్అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ.. బ్యారేజీలను పరిశీలించింది. అధికారుల నుంచి వివరాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక త్వరగా వచ్చేలా చూడాలంటూ గత సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులకు జస్టిస్ ఘోష్ సూచించారు. దాని ఆధారంగా కూడా విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. దీంతో ఈ మూడునాలుగు రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక కూడా వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే బ్యారేజీని తిరిగి వాడుకునేందుకు టెంపరరీగా చేపట్టాల్సిన పనులపై ఎన్డీఎస్ఏకి ఇటీవలే రాష్ట్ర అధికారులు లేఖ రాశారు. దీంతో ఆ నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి విషయాన్ని విస్పష్టంగా రిపోర్ట్‌లో పేర్కొంటున్నట్టు సమాచారం.