
నిర్మల్, వెలుగు: మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసమే పోలీసుల ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కె.కర్ణ కుమార్ పేర్కొన్నారు. నిర్మల్ లో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ను ఆదివారం ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోక్సో చట్టానికి అనుగుణంగా భరోసా సెంటర్ను తీర్చిదిద్దారని.. మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను తగ్గించేందుకు ఈ సెంటర్ ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
వేధింపులు, అత్యాచార బాధిత మహిళలకు, పిల్లలకు ఒకే చోట మెడికల్, సైకలాజికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారని, బాధితులందరికీ సెంటర్ అండగా ఉంటుందన్నారు. సీడబ్ల్యూసీ ద్వారా బాధిత మహిళలకు ఆశ్రయం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు మొదలుకొని, చివరివరకు బాధితు లకు భరోసా సెంటర్ అండగా ఉంటుందన్నారు. నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, సూపరింటెండెంట్లు లక్ష్మీ నరసింహ, శ్రీనివాస్, నిర్మల్ టౌన్ సీఐ పురు షోత్తం చారి, రూరల్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.