- సుప్రీంను ఆశ్రయించకముందే 78 పేజీల నివేదిక రెడీ చేసిన : జస్టిస్ నర్సింహారెడ్డి
- కేసీఆర్ ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే
- అభ్యంతరకర పదాలతో తిరిగి12 పేజీల లేఖ
- పంపిండుబిడ్డ జైల్లో పడ్డంక కేసీఆర్‌కు ఇంకెక్కడి పరువని కామెంట్
హైదరాబాద్, వెలుగు : పదేండ్లపాలనలో జరిగిన విద్యుత్అవకతవకలపై ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్‌నుంచి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తప్పించుకోలేరని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. పవర్ కమిషన్ చైర్మన్‌గా తాను విచారణను వేగంగా పూర్తిచేశానని చెప్పారు. చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ స్టేషన్లలో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేశానని, వివిధ వర్గాలనుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిందని తెలిపారు.
సుప్రీంకోర్టును కేసీఆర్ఆశ్రయించకముందే 78 పేజీల నివేదికను రెడీ చేసినట్టు వెల్లడించారు. శనివారం ఆయన ‘వెలుగు’ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. విచారణ కమిషన్ నుంచి 28 మందికి లేఖలు రాస్తే ప్రభుత్వ అధికారులు సహా ప్రతి ఒక్కరూ నేరుగా వచ్చి అభిప్రాయాలు వెల్లడించడంతోపాటు వారి వద్ద ఉన్న ఆధారాలు ఇచ్చి వెళ్లారని చెప్పారు. కేసీఆర్ ఒక్కరే 12 పేజీల లేఖ రాశారని, అందులో కమిషన్ అర్హతను ప్రశ్నించడంతోపాటు అభ్యంతరకరమైన భాష, పద ప్రయోగాలున్నాయని వివరించారు. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం కేసీఆర్ గౌరవానికి భంగం కలుగకుండా..
మర్యాదపూర్వకంగా లేఖలు రాశానని చెప్పారు. పొంతన లేని సమాధానాలతో కేసీఆర్ రిప్లై ఇచ్చినా అంతగా పట్టించుకోలేదని అన్నారు. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ కొట్టేసినా.. సుప్రీంకోర్టులో కూడా ఆయన ఆశించినట్టు ఫలితం రాకపోయినా కమిషన్ ఎక్కడా స్పందించలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు రాకముందే తానే బాధ్యతలనుంచి తప్పుకున్నట్టు చెప్పారు.
ఇదిప్పుడు డెడ్ రిపోర్టే!
తన చేతిలో ఉన్న 78 పేజీల నివేదిక ఇక డెడ్రిపోర్టేనని జస్టిస్నర్సింహారెడ్డి పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో ఏం జరిగింది? ఏ నిపుణులు ఏం చెప్పారు? బీహెచ్ఈఎల్లాంటి సంస్థలు ఎలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చాయి? లాంటి విషయాలన్నీ అందులో ఉన్నట్టు చెప్పారు. కానీ.. విచారణ నైతికత మేరకు ఇందులోని ఏ ఒక్క విషయాన్ని తాను బయటపెట్టలేనని అన్నారు. మీడియా పదేపదే అడిగినా తాను ‘సారీ’ అనే చెబుతానన్నారు. కొత్త కమిషన్ తనదైన పద్ధతిలో విచారిస్తుందని, నివేదికను ప్రభుత్వానికి అందిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
కోర్టుపై గౌరవంతో వెనక్కి తగ్గా
సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే తాను ప్రభుత్వానికి ఈ నివేదిక ఇవ్వొచ్చని, బహిరంగ విచారణ కాబట్టి రిపోర్ట్‌ను బహిర్గతం చేయొచ్చని జస్టిస్నర్సింహారెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించిన విషయం అనధికారికంగా తనకు తెలిసినా.. నివేదికను బహిర్గతం చేయలేదని చెప్పారు. సుప్రీంకోర్టుపై ఉన్న గౌరవంతో తాను వెనక్కి తగ్గినట్టు తెలిపారు. తనకు నైతికత ముఖ్యమని అన్నారు.
నేనూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా...
తానూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, 8వ చాప్టర్ అంశంలో తన పాత్రను ఎవ్వరూ శంకించలేరని జస్టిస్నర్సింహారెడ్డి అన్నారు. ‘‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’’ అనే పాట విని గొల్లున ఏడ్చానని చెప్పారు. హైకోర్టులో తన తీర్పులను చూసి తోటి న్యాయమూర్తులు, సీనియర్లు, ఇతర ప్రాంతాల నుంచి ఫోన్ చేసి బెదిరించారని, అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. అభిశంసనకు సిద్ధం కావాలని హెచ్చరించినా తాను ఖాతరు చేయలేదని అన్నారు. అయినా.. కేసీఆర్తన విషయంలో ఎప్పుడూ సరిగ్గా స్పందించలేదని తెలిపారు. తెలంగాణ వచ్చాక పదేండ్లలో కేసీఆర్‌ను తాను ఎక్కడా కలువలేనది చెప్పారు.
ఆ భూమి చట్టబద్ధంగా కొన్నా
ఉస్మానియావి అంటూ కొందరు ఆరోపించిన 300 గజాల భూమిని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కొన్నానని, కొంత వివాదం ఉంటే కోర్టు తీర్పుల అనంతరం ఆ ప్రతులను అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, సీపీ అంజన్ కుమార్ కు చూపించానని జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పారు. వారి అనుమతితోనే ఆ భూమిలో పని ప్రారంభించానని, రెండు రోజులకే విద్యార్థి సంఘాల ముసుగులో కొందరొచ్చి గొడవ పెట్టి, నానా యాగి చేశారని చెప్పారు. ఇదేంటని మళ్లీ అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, సీపీ అంజనీకుమార్ ను అడిగితే.. ‘ సారీ సార్.. మాకు పై నుంచి ప్రెషర్ ఉన్నది.. హై లెవల్ పొలిటికల్ ప్రెషర్’ అని చెప్పారన్నారు.
పదేండ్ల పాలనలో అనేక అరాచకాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని, స్వయం పాలన రావాలని తాను కోరుకు న్నట్టు జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పారు. కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక పదేండ్ల పాలనలో అనేక అరాచకాలు జరిగాయని తెలిపారు. భూము లపరంగా చెప్పలేని విధ్వంసాలు జరిగాయని పేర్కొన్నారు. పాలనలో వైఫల్యాలు కొట్టొచ్చి నట్టు కనిపించాయని చెప్పారు.
తెలంగాణలో ఆస్తులు కాదు..పరువు ముఖ్యం
తెలంగాణలో ఆస్తులు కాదని, పరువే ముఖ్యమని జస్టిస్నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బిడ్డ (కవిత) జైల్లో పడ్డంక ఇక కేసీఆర్‌కు పరువు ఎక్కడిదని అన్నారు. బిడ్డ జైలు పాలైతే పట్టదుగానీ.. రాజకీయాలు కావాల్నా? అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణోళ్ల పరువు తీశారని అన్నారు. ఇక విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ పాత్ర గురించి కొత్త కమిషనే చెబుతుందని అన్నారు. మీడియా తిప్పితిప్పి అడిగినా తన సమాధానం ఇదేనని చెప్పారు.