
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పు వెల్లడించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు కోటి రూపాయల జరిమానా విధించారు. ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను హైకోర్టు అడ్డుకుంది. దీంతో.. హైకోర్టులో పెండింగ్ విషయం దాచి పిటిషనర్లు మరో బెంచ్ వద్దకు వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిటిషన్ పెండింగ్‌లో ఉండగా మరో బెంచ్‌లో ఆర్డర్ తీసుకోవడంతో పిటిషనర్లపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తే జరిమానా విధించిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. కానీ.. కోటి రూపాయల జరిమానా విధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవాలను దాచి కోర్టును తప్పదోవ పట్టించారనే కేసులో 2024 ఏప్రిల్లో ఆదిబట్ల మాజీ చైర్‌పర్సన్ కె.ఆర్తికకు హైకోర్టు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు సమయాన్ని వృథా చేశారని, అధికారులపై నిరాధార ఆరోపణలు చేశారని ఆ సమయంలో హైకోర్టు తప్పుపట్టింది.
ఆధారం లేకుండా, పనికిమాలిన పిటిషన్ వేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బీసీ మహిళనంటూ కోర్టు సానుభూతి పొందలేరని చెప్పింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, రూ.లక్ష జరిమానా సొమ్మును నాలుగు వారాల్లోగా లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.