
బషీర్బాగ్, వెలుగు: మూట్ ట్రిబ్యునల్ పోటీలతో విద్యార్థులు చట్టపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్.వి. శ్రావణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలోని భాస్కర ఆడిటోరియంలో తెలంగాణ అండ్ ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ 4వ మూట్ ట్రిబ్యునల్ పోటీలను శనివారం నిర్వహించారు. దాదాపు 300 మంది క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్లు, లా విద్యార్థులు ఇందులో పాల్గొనగా, జస్టిస్ ఎన్.వి. శ్రావణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు.
మూట్ ట్రిబ్యునల్ పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కేసులు వాదించడానికి కొద్దిమంది సీనియర్ న్యాయవాదులు మాత్రమే ఉన్నారని ఆ ట్రిబ్యునల్ హైదరాబాద్ జోన్ ఉపాధ్యక్షుడు విజయ్ పాల్ రావు అన్నారు. జూనియర్ న్యాయవాదులు కీలకమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఐటీఏడీలో ప్రాక్టీస్ ప్రారంభించాలని సూచించారు.