- ఉమ్మడి ఏపీలో జడ్జిగా సేవలు
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వత రావు (90) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు ముగ్గురు కుమార్తెలున్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కోదండరాం.. ఆయన అల్లుడు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు ప్రముఖులు జస్టిస్ పర్వతరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జస్టిస్ పర్వతరావు.. 1961లో అడ్వొకేట్‌గా ఎన్‌రోల్ అయ్యారు. అప్పటి అడ్వొకేట్ జనరల్ డి.నరసరాజు చాంబర్లో జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1990, మార్చి 16న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997, నవంబర్ 26 వరకు జడ్జిగా కొనసాగారు. పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు.
జడ్జిగా రిటైర్ అయ్యాక రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్ చైర్మన్‌గా కొంతకాలం సేవ చేశారు. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రజ్ఞా భారతి, భారతీయ ఆదివక్త పరిషత్ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. సేంద్రియ వ్యవసాయంపై పలు జిల్లాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు.