- కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం
- రేపు కడెం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన
- పలువురు అధికారులకు నోటీసులిచ్చే అవకాశం
- విచారణ ఏర్పాట్లపై ఇరిగేషన్
- అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వేగవంతం చేయనున్నారు. గురువారం ఆయన రాష్ట్రానికి రానున్నారు. వచ్చిన వెంటనే దెబ్బతిన్న బ్యారేజీలను మరోసారి పరిశీలించనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే టెక్నికల్ కమిటీకి సంబంధించిన సిబ్బందిని జ్యుడీషియల్ కమిషన్ కు రాష్ట్ర సర్కార్ కేటాయించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ ఘోష్ ఆ టెక్నికల్ కమిటీని తీసుకుని వెళ్లి బ్యారేజీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోనున్నట్టు తెలుస్తున్నది.
శుక్రవారం మొదట కడెం ప్రాజెక్టు వద్దకు వెళ్లి, ఆ డ్యామ్ భద్రతపైనా ఆరా తీయనున్నట్టు సమాచారం. అనంతరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారని తెలిసింది. కాగా, జస్టిస్ ఘోష్ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రానికి వచ్చి అధికారులతో సమావేశమయ్యారు. మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్రావును విచారించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియడంతో విచారణను మరింత వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. మరోవైపు జస్టిస్ ఘోష్ విచారణ కోసం వస్తుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఇరిగేషన్‌శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రివ్యూ చేసినట్టు తెలిసింది. ఆయనకు కావాల్సిన సమాచారం అందజేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చినట్టు సమాచారం.
మరింత మందికి నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పలువురు సీనియర్అధికారులతో పాటు మాజీ ఈఎన్సీలను కూడా విచారణకు జస్టిస్ ఘోష్ పిలుస్తారని తెలుస్తున్నది. ఇప్పటికే ఈఎన్సీ వెంకటేశ్వర్రావు నుంచి వివరాలు తీసుకున్న ఆయన.. ఈసారి మాజీ ఈఎన్సీ మురళీధర్‌కు నోటీసులిచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే దాకా మురళీధర్నే కీలకంగా ఉండడంతో, ఈసారి విచారణకు ఆయనను పిలిచే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.
పబ్లిక్ నుంచి ఫిర్యాదులను తీసుకునేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఆఫీసులో సజెషన్ బాక్సులు ఏర్పాటు చేశారు. జస్టిస్ ఘోష్ వచ్చాక ఆ బాక్సులను ఓపెన్ చేసి, ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి వివరాలు తీసుకుంటారని సమాచారం. అలాగే ఇరిగేషన్ అధికారులతోనూ ఆయన సమావేశమవుతారని తెలిసింది.