- కాంట్రాక్టర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం
- రిజర్వాయర్ల పనులు ఆగమాగం ఎందుకు చేసిన్రు?
- డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో బ్యారేజీల మెయింటెనెన్స్ ఎందుకు చేపట్టలే?
- విచారణకు హాజరైన ఎల్ అండ్ టీ, నవయుగ, ఆఫ్కాన్స్ ప్రతినిధులు
- నాటి ప్రభుత్వం తొందర పెట్టడం వల్లే ఫాస్ట్‌గా చేయాల్సి వచ్చిందని రిప్లై
- ఈ నెలాఖరుకల్లా పూర్తి వివరాలు ఇవ్వాలని ఘోష్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం డిజైన్లు ఎవరు మార్చారని ప్రాజెక్టు నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రాజెక్ట్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోశ్ ప్రశ్నించారు. పనుల అంచనాలు ఎందుకు పెరిగాయని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలైన ఎల్ అండ్ టీ (మేడిగడ్డ), ఆఫ్కాన్స్ (అన్నారం), నవయుగ (సుందిళ్ల) నుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులు బుధవారం జస్టిస్ ఘోష్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారి నుంచి బ్యారేజీల టెక్నికల్, ఫైనాన్స్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన అంశాలను జస్టిస్ ఘోష్ అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీల నిర్మాణం చేపట్టిన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘కాళేశ్వరం బ్యారేజీలకు డిజైన్లు ఎవరిచ్చారు? మొదట అనుకున్న డిజైన్లను ఎందుకు మార్చారు? పనుల అంచనాలు అంతలా ఎందుకు పెరిగాయి? డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లోనూ బ్యారేజీల మెయింటెనెన్స్‌ను ఎందుకుచేపట్టలేదు? అని ప్రశ్నించారు.
గత సర్కారు చెప్పినట్టే చేష్నం : నిర్మాణ సంస్థలు
గత బీఆర్ఎస్ సర్కారు చెప్పినట్టే కాళేశ్వరం బ్యారేజీలు నిర్మించామని జస్టిస్ ఘోష్‌కు నిర్మాణ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బ్యారేజీల నిర్మాణానికి డెడ్ లైన్లు పెట్టిందని, ఆ ప్రకారం పనులను స్పీడ్‌గా చేయాల్సి వచ్చిందని వివరించారు. రికార్డ్ సమయంలో పనులను పూర్తి చేయాల్సి వచ్చినందున లోపాలు తలెత్తవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా బ్యారేజీల డిజైన్లలో మార్పు , పనుల అంచనాల పెంపు, బ్యారేజీల నిర్మాణానికి అయిన ఖర్చు, డ్రా చేసిన మొత్తాల గురించి ఘోష్ ఆరా తీసినట్టు తెలిసింది.
కాగా, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లోనూ బ్యారేజీల మెయింటెనెన్స్‌ను ఎందుకు చేపట్టలేదనే విషయంపై ఎక్కువ ప్రశ్నలు అడిగిన ఘోష్.. వారినుంచి సమాధానం రాబట్టినట్టు సమాచారం. కాగా, తనకు చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో ఈ నెలాఖరులోగా సమర్పించాలని సంస్థ ప్రతినిధులను జస్టిస్ ఆదేశించారు.
గత సర్కారు ఒత్తిడి వల్లే ఆదరాబాదరాగా పనులు
గత ప్రభుత్వం కాళేశ్వరం రిజర్వాయర్లకు డెడ్లైన్లు పెట్టి, ఒత్తిడి చేయడం వల్లే పనులను వేగంగా పూర్తిచేయాల్సి వచ్చిందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పారని, అందరి నుంచి అదే స్టేట్‌మెంట్ వచ్చిందని జస్టిస్ఘోష్ తెలిపారు. బుధవారం నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఎంక్వైరీ చేసిన అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘బ్యారేజీల నిర్మాణం, డిజైన్లు, నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించాం. ఎవరు ఏది చెప్పినా పక్కా రికార్డులను మెయింటెయిన్ చేస్తున్నాం.
అన్ని వివరాలను రికార్డు రూపంలో ఉంచుతున్నాం. ఈ నెలాఖరులోపు అఫిడవిట్లు ఇవ్వాలని నిర్మాణ సంస్థలను ఆదేశించాం. ఎవరి ఆదేశాల మేరకు పనులు ఆదరాబారాగా జరిగాయన్నది రికార్డు రూపంలో సమాధానం వచ్చాకే వాళ్లను కూడా విచారణకు పిలుస్తాం. బాధ్యులెవరైనా వదలం. కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరు. ఔట్ఆఫ్ స్టేషన్‌లో ఉన్నారు. వాళ్లనూ విచారించాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి.. వాటిని పరిశీలిస్తున్నాం. వాళ్లను కూడా విచారిస్తాం. తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే మాకు తెలిసిపోతుంది” అని ఆయన స్పష్టం చేశారు.