
- పది రోజుల పాటు విచారణ జరపనున్న కాళేశ్వరం జుడీషియల్ కమిషన్ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అవకతవకలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టీస్ పినాకీ చంద్ర ఘోష్ వచ్చే నెల 7న రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఇక్కడికి వచ్చి పలువురు అధికారులను విచారించిన ఆయన.. ఈ దఫా పది రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణను కొనసాగించనున్నారు. ఈ నెల 6 నుంచి 12 వరకు విచారణ చేసిన ఆయన.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీలను స్వయంగా పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. తాజాగా ఎన్నికల కోడ్ ముగిసే దశకు వస్తుండడంతో.. జూన్ 7న మరోసారి రాష్ట్రానికి రానున్నారు. న్యాయ విచారణ కమిషన్‌కు సంబంధించి ఇప్పటికే నోడల్ ఆఫీసర్‌గా ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ప్రభుత్వం నియమించింది.
ఇవాళ్టితో ఫిర్యాదుల గడువు పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత అంశాలపై ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు కమిషన్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుల గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇప్పటివరకు 4 ఫిర్యాదులు మాత్రమే వచ్చినట్లు తెలిసింది.