- మధ్యంతర నివేదిక సమర్పించిన విజిలెన్స్ శాఖ
- కమిషన్ ముందు హాజరైన డీజీ సీవీ ఆనంద్
- రేపటి నుంచి ప్రాజెక్ట్‌పై బహిరంగ విచారణ
- క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న చైర్మన్ జస్టిస్ ఘోష్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్‌కు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీకి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ అందింది. ఎప్పటినుంచో రిపోర్ట్ అడుగుతున్నా ఆ శాఖ నుంచి స్పందన రాలేదు. దీంతో వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ శాఖను జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆదేశించినట్టు తెలిసింది.
ఇందులో భాగంగానే సోమవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ముందు విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ ఘోష్ ఆదేశించడంతో.. సోమవారం సాయంత్రం రిపోర్ట్‌ను అందజేసినట్టు సమాచారం. బ్యారేజీలకు సంబంధించి విచారణాంశాలపై సీవీ ఆనంద్‌ను జస్టిస్ ఘోష్ ప్రశ్నించినట్టు తెలిసింది. తుది నివేదికను త్వరగా ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. కాగా, బుధవారం నుంచి జస్టిస్ ఘోష్ బహిరంగ విచారణ చేపట్టనున్నారు. అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని విచారించడంతోపాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని సమాచారం.