న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 2025 మే 13 వరకు పదవిలో ఉంటారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో పూర్తయింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో అడ్వొకేట్ గా ఎన్ రోల్ చేసుకున్నారు.
మొదట జిల్లా కోర్టుల్లో, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు కౌన్సిల్ గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, అమికస్ క్యూరీగా సేవలందించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా, 2006లో పర్మనెంట్ జడ్జిగా అపాయింట్ అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా కొడుకు, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా మేనల్లుడు.