సీజేఐగా జస్టిస్ సంజీవ్​ ఖన్నా, తొలి రోజే ముందుకు వచ్చిన 45 కేసులు

సీజేఐగా జస్టిస్ సంజీవ్​ ఖన్నా, తొలి రోజే ముందుకు వచ్చిన 45 కేసులు

న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్‌‌  సంజీవ్‌‌  ఖన్నా ప్రమాణం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌‌లోని గణతంత్ర మండపంలో జస్టిస్‌‌  సంజీవ్‌‌  ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్‌‌  ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌‌ రామ్‌‌ మేఘవాల్‌‌, మాజీ సీజేఐలు జస్టిస్‌‌  డీవై చంద్రచూడ్, జస్టిస్‌‌  ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్‌‌  అబ్దుల్‌‌  నజీర్‌‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మోదీ, ధన్కడ్  తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ లో జస్టిస్  ఖన్నాకు శుభాకాంక్షలు చెప్పారు. వారందరికీ, వారితో పాటు తనకు అభినందనలు తెలిపిన బార్ లీడర్లు, అడ్వొకేట్లకు జస్టిస్  సంజీవ్  ఖన్నా కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నాన్న గదిలో కూర్చుని తొలి రోజు విచారణ

సీజేఐగా జస్టిస్‌‌ డీవై చంద్రచూడ్‌‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో కొత్త సీజేఐగా జస్టిస్‌‌ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీజేఐ నేరుగా సుప్రీంకోర్టుకు  చేరుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆయన చిన్నాన్న జస్టిస్​ హన్స్‌‌రాజ్‌‌ ఖన్నా కూర్చున్న గది నుంచి తన తొలిరోజు విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రారంభించారు. వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా ఆయన కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. భద్రతా కారణాల వల్ల మార్నింగ్ వాక్​ను వదులుకున్నారు. ఇప్పుడు పదవీకాలం తక్కువగా ఉండడంతో సీజేఐ అధికారిక నివాసం కృష్ణమీనన్‌‌ మార్గ్​కు మారేందుకు విముఖత చూపించినట్లు సమాచారం. కాగా.. మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సిఫారసుల మేరకు సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ గత నెల 25న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

మనీలాండరింగ్​ కేసులో నేతలకు బెయిల్​

జస్టిస్  సంజీవ్ ఖన్నా.. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్య పూర్తిచేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత ఏడాదే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ అయ్యారు. అలా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్​ జడ్జిగా ఎదిగారు. ఈ ఆరేళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. తాజా మాజీ సీజేఐ చంద్రచూడ్, ఇతర సీనియర్  జడ్జిలతో కలిసి 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగమయ్యారు. ఆర్టికల్‌‌ 370 రద్దును సమర్థించిన బెంచ్​లోనూ ఉన్నారు. 

2021లో సెంట్రల్‌‌  విస్టా ప్రాజెక్టు కేసు విచారణ బెంచ్​లో మెజారిటీ నిర్ణయంతో జస్టిస్‌‌ ఖన్నా విభేదించారు. వీవీపీఏటీ స్లిప్‌‌లను ఈవీఎంతో సరిపోల్చాలని దాఖలైన పిటిషన్‌‌ను జస్టిస్ దీపాంకర్‌‌  దత్తాతో కలిసి తిరస్కరించారు. ఎన్నికల కమిషనర్లుగా మాజీ సీవిల్ సర్వీస్ అధికారులు జ్ఞానేష్‌‌  కుమార్, సుఖ్‌‌బీర్‌‌  సింగ్‌‌ సంధూల నియామకంపై స్టే కు నిరాకరించారు. రాజకీయ పార్టీలకు విరాళాలను అనుమతించే ఎలక్టోరల్‌‌ బాండ్‌‌ స్కీంను కొట్టివేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరిగా తీర్పు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్‌‌  కేసులో కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్, సంజయ్ సింగ్‌‌కు బెయిల్‌‌ మంజూరు చేశారు. ముంబై కాలేజీ క్యాంపస్‌‌లో స్టూడెంట్లు బురఖా, హిజాబ్, నిఖాబ్‌‌ ధరించడంపై ఆంక్షలు విధించిన కేసులో జస్టిస్‌‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పాక్షికంగా స్టే విధించింది.

తొలి రోజే 45 కేసులు..

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే 45 కేసులు ఆయన ముందు విచారణకు వచ్చాయి. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేసుల విచారణ జరిపారు. వాటిలో ఎక్కువగా కమర్షియల్  వివాదాలే ఉన్నాయి. 1960 మే 14న జన్మించిన సంజీవ్  ఖన్నా.. వచ్చే ఏడాది మే 13న రిటైర్  అవుతారు. అప్పటికి ఆయనకు 65 ఏండ్లు నిండుతాయి.