51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్‌ఖన్నా సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవీకాలం 183 రోజులు. 13 మే 2025న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా 2005లో నియమితులయ్యారు. సుప్రీంకోర్టు వెబ్సైట్ ప్రకారం తీస్‌హజారీ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగం, ప్రత్యక్ష పన్నులు, వాణిజ్య చట్టం, కంపెనీ చట్టం వంటి విభిన్నరంగాల్లో ఆయన ప్రాక్టీస్ చేశారు.
ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ తరువాత జాతీయ రాజధాని ఢిల్లీకి సివిల్ విషయాలకుగాను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులైనారు. చాలా క్రిమినల్ కేసులలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో అమికస్ క్యూరీగా వాదనలను ఢిల్లీ హైకోర్టులో వినిపించారు. ఏడియం జబల్పూర్ కేసులో తన భిన్నాభిప్రాయాన్ని ప్రకటించి ప్రధాన న్యాయమూర్తి పదవిని అందుకోలేకపోయిన జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకి మేనల్లుడు జస్టిస్ సంజీవ్‌ఖన్నా. ఎమర్జెన్సీ కాలంలో కూడా ప్రాథమిక హక్కులు పౌరులకు ఉంటాయని జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా తన
భిన్నాభిప్రాయ తీర్పుని ప్రకటించారు. అది ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచి. అందులో నలుగురు ఒకవైపు హెచ్ఆర్ ఖన్నా మరోవైపుగా తన అభిప్రాయాన్ని వెలువరించారు.
నియామకం వివాదాస్పదం
సంజీవ్ఖన్నాని జనవరి18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించినారు. ఆయన నియామకం కూడా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే అఖిల భారత సీనియారిటీలో అతనిది 33వ స్థానం. చాలామంది సీనియర్ న్యాయమూర్తులను పక్కనబెట్టి ఆయనను సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేశారు. ఢిల్లీ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులను పక్కనబెట్టి జస్టిస్ సంజీవ్ ఖన్నాని నియమించాలని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ అధ్యక్షతనగల ఐదుగురు సభ్యుల కొలీజియం సిఫారసు చేసింది. అప్పుడు ఆ కొలీజియంలో సిక్రీ, ఎస్ఎ బాబ్డె, ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రాలు ఉన్నారు. ఢిల్లీ హైకోర్టుకి చెందిన జస్టిస్ ప్రదీప్ నంద జోగ్, గీతా మిట్టల్, ఎస్ రవీంద్రభట్లను పక్కనబెట్టి ఆయనను సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించారు. రవీంద్ర భట్ 23 సెప్టెంబర్ 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తనని సుప్రీంకోర్టుకి ఎలివేట్ చేయడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించిందని ఢిల్లీ హైకోర్టులో ఏర్పాటుచేసిన వీడ్కోలు సభలో జస్టిస్ సంజీవ్‌ఖన్నా అన్నారు.
జస్టిస్ ప్రదీప్ నంద్ జోగ్ని పక్కనబెట్టి జస్టిస్ సంజీవ్ఖన్నాని సుప్రీంకోర్టు ఎలివేట్ చేయడంపై తన అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తూ అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి గొగొయ్‌కు లేఖ రాశారు. అయితే, విచిత్రమైన విషయం ఏమిటంటే 12 డిసెంబర్ 2018న జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ నంద జోగ్ల నియామకాన్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వాళ్లని సిఫారసు చేసిన కొలీజియంలో జస్టిస్ మదన్ బి లోకూర్ సభ్యుడు. ఆ తీర్మానం ప్రతిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరచలేదు.
కొలీజియం సిఫారసు విస్మరించినందుకు నిరాశ
జస్టిస్ లోకూర్ డిసెంబర్ 2018లో పదవీ విరమణ చేశారు. ఆ తరువాత జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ఖన్నాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎలివేట్ చేస్తూ తీర్మానం చేశారు. 10 జనవరి 2019నాటి తీర్మానంలో వాళ్లని ఎందుకు ఎలివేట్ చేయలేదో పేర్కొనలేదు. ఆ తరువాత జస్టిస్ మదన్ బి లోకూర్ తాము సంతకం చేసి కొలీజియం సిఫారసు విస్మరించినందుకు తాను నిరాశ చెందినట్టు తెలిపారు. విచిత్రమైన విషయం ఏమంటే జస్టిస్ గొగొయ్ తన ఆత్మకథలో జస్టిస్ సంజీవ్ఖన్నాని ఎందుకు అప్పుడు ఎలివేట్ చేయాల్సి వచ్చిందో వివరించారు. ఆ సమయంలో అతన్ని ఎలివేట్ చేస్తే అతను ఆరుమాసాలపాటు ప్రధాన న్యాయూర్తిగా ఉండే అవకాశం ఉందని తన ఆత్మకథలో జస్టిస్ గొగొయ్ రాశారు. 2006వ సంవత్సరం నుంచి ఢిల్లీ హైకోర్టు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి కాలేదని కూడా ఆయన పేర్కొన్నారు.
కేసుల సత్వర పరిష్కారం కోసం మార్పులు?
గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల సమయంలో ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లతో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ స్లిప్పులను (వీవీపీఏటీ) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించి బెంచిలో జస్టిస్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతోపాటు ఉన్నారు. అదేవిధంగా గత ఏడాది లోక్‌సభ ఎన్నికలముందు కొత్త ఎన్నికల కమిషనర్లుగా మాజీ బ్యూరోకాట్ల నియామకంపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని బెంచి నిరాకరించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ నిరాకరిస్తూ జస్టిస్ ఖన్నా తీర్పునిచ్చారు. అదేకేసులో అరెస్టు అయిన అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, బెయిల్ మీద ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదని ఆదేశించిన కారణంగా కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా చాలా తీర్పులను పేర్కొనవచ్చు. కాగా, 183 రోజుల్లో చేసే మార్పుల గురించి దేశం ఎదురుచూస్తోంది. సత్వరం కేసుల పరిష్కారం చేసే మార్పుల కోసం అందరూ ఎదురుచూస్తారు. 183 రోజులు తక్కువ కాలం ఏమీ కాదు. సంకల్పం ముఖ్యం.
కీలక తీర్పుల్లో సంజీవ్ ఖన్నా భాగస్వామి
ఢిల్లీ హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి దాకా వెళ్లిన వైకె సబర్వాల్ 2006లో పదవీ విరమణ చేశారు. జస్టిస్ సంజీవ్‌ఖన్నా చాలా కీలకమైన తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. జస్టిస్ గొగొయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి సుప్రీంకోర్టు తమకు తాముగా స్వీకరించిన కేసులో జస్టిస్ ఖన్నా భాగస్వామి. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలను బెంచి మౌఖికంగా ఆరోపణలను ఖండించి, వారి ఉద్దేశ్యాలను ప్రశ్నించింది. ఆ బెంచ్‌లో ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు.
వారు జస్టిస్ గొగొయ్, జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఖన్నా. అయితే, సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని ఉత్తర్వులమీద జస్టిస్ మిశ్రా, జస్టిస్ సంజీవ్‌ఖన్నాలు మాత్రమే సంతకాలు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా స్వయంగా అనేక కీలక తీర్పులను వెలువరించారు. గత సంవత్సరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన భాగస్వామి. అనామక విరాళాలు స్వీకరించే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ని కొట్టివేసిన బెంచిలో కూడా ఆయన భాగస్వామి.
- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)