తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్‌ ఖన్నా

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్‌ ఖన్నా
  • కేంద్రానికి సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
  • నవంబర్ 10తో ముగియనున్న పదవీ కాలం
  • రాష్ట్రపతి ఆమోదిస్తే 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా

న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. జస్టిస్ ఖన్నా పేరును ప్రతిపాదిస్తూ కొలీజియం సిఫార్సు లేఖను కేంద్రానికి పంపించారు. 

నవంబర్ 10తో సీజేఐ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ముగియనున్నది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. వచ్చే ఏడాది మే 13న పదవీ విరమణ చేస్తారు. కాగా, జస్టిస్‌‌‌‌ డీవై చంద్రచూడ్ 2022 నవంబర్ 9న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిలు 65 ఏండ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తారు.

కీలక తీర్పుల్లో భాగస్వామిగా..

జస్టిస్ సంజీవ్ ఖన్నా..సుప్రీం కోర్టు జడ్జిగా కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, జమ్మూ కాశ్మీర్​కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ బెయిల్ వంటి కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరుగా ఉన్నారు. కాగా, నిబంధనల ప్రకారం.. సీజేఐ పదవీ విరమణ తర్వాత సుప్రీం కోర్టులో ఉన్న సీనియర్ జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకుంటారు. 

జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా సీనియర్​గా ఉన్నారు. అందుకే ఆయన పేరును కేంద్రానికి సిఫార్సు చేశారు. ఆ తర్వాత లేఖ న్యాయ మంత్రిత్వ శాఖ వద్దకు.. అటు నుంచి పరిశీలన కోసం ప్రధానమంత్రికి వెళ్తుంది. ఆయన ఆమోదించాక లేఖ రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. చివరికి రాష్ట్రపతి అనుమ తితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడ్తారు.