
బషీర్బాగ్, వెలుగు:రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ తో పాటు సభ్యులుగా శివాది ప్రవీణ (జ్యుడీషియల్), డాక్టర్ బి. కిషోర్ ( నాన్ జ్యుడీషియల్) కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ మాట్లాడారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వచ్చే కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మానవహక్కుల కమిషన్ లో రెండేండ్ల మూడు నెలల పాటు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కాలంలో దాదాపుగా 4,800 కేసులు విచారణకు వచ్చాయి. పాత కేసులు10 వేల వరకు పెండింగ్ లో ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేసింది.
కమిషన్ చైర్మన్ ను కలిసిన డీజీపీ
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ షమీమ్ అక్తర్ ను రాష్ట్ర డీజీపీ జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తో కలిసి బోకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.