రాజకీయాల్లో ప్రతిభకు న్యాయం జరగాలి

 

ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏవో హ్యూమ్ 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ అనే సంస్థను ప్రారంభించారు. రాజకీయ వివక్ష లేకుండా ప్రభుత్వ పాలన ఉండాలి, సామాజిక వివక్ష దూరం చేయాలి, సాంఘిక దురాచారాల నిర్మూలనకు పని చేయాలనేది దీని ఉద్దేశం. ఈ లక్ష్యంతో 72 మంది ప్రతినిధులతో కాంగ్రెస్ ఏర్పాటైంది. దీనికి మొదటి అధ్యక్షుడిగా ఉమేష్ చంద్ర బెనర్జీ ఎన్నికయ్యారు. ఈ సంస్థ ఏడాదికోసారి అధ్యక్షుడిని ఎన్నుకొని సమష్టి, ప్రజాస్వామ్యబద్ధ నిర్ణయాలు తీసుకునేది. అందులో ఉన్నవారంతా మంచి దేశభక్తులు. అధ్యక్షుడు అనేవాడు ప్రత్యేకం కాదు, సభను నడిపించే ఒక ప్రతినిధిగానే భావించేవారు. ఆ తర్వాత ఇదే కాంగ్రెస్ భారత స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో పాల్గొంటూ కీలక పార్టీగా మారింది. 1905 బెంగాల్ విభజనను వ్యతిరేకించి స్వదేశీ ఉద్యమంపై పోరాటం చేసింది. తదనంతరం గాంధీజీ రాజకీయ ప్రవేశం చేయడం,1920లో సహాయ నిరాకరణ, అంతకుముందు ఖిలాఫత్ ఉద్యమం కొనసాగాయి. ఇక్కడి నుంచి గాంధీజీ ప్రాతినిధ్యంలో ఖిలాఫత్ ను సమర్థించి సంతృప్తీకరణ రాజకీయాలకు పునాది వేశారు. 1924లో గాంధీజీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై, ఒక సంవత్సరం పాటు కొనసాగారు. 1938–-39లో నేతాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నేతాజీ రెండోసారి పోటీ చేసినప్పుడు గాంధీజీ పక్షాన పట్టాభిసీతారామయ్యను అభ్యర్థిగా నిలబెట్టారు. ఎన్నికల్లో గాంధీజీ అభ్యర్థి ఓడిపోయి నేతాజీ గెలిచారు. 

ఆ రోజు కాంగ్రెస్ లో ఈ ప్రజాస్వామ్యం ఉందని గమనించాలి. అప్పటి నుంచి గాంధీజీ నేతాజీపై కక్ష పెంచుకొని అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే విధంగా ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత అధ్యక్ష కాలాన్ని రెండు సంవత్సరాలకు, రెండు పర్యాయాలకు అంటే నాలుగేండ్లకు మార్చారు. ఇక్కడ గాంధీజీ మాట నడవకపోవడంతో అధ్యక్ష కాలాన్ని పొడిగించుకొని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. అప్పటి నుంచి సంతృప్తీకరణ విధానం, ఒకే వ్యక్తి చేతిలో పార్టీ అధికారం ఉండటం వల్ల దేశ విభజన జరిగింది. దేశం విముక్తమయ్యాక నెహ్రూ కుటుంబం గాంధీ వారసత్వ సంస్థగా మారి నేటికీ కొనసాగుతున్నది. స్వాతంత్ర్యం వచ్చాక ప్రజాస్వామ్యబద్ధంగా పటేల్ కు మెజారిటీ వచ్చినా గాంధీజీ నియంతృత్వ విధానమే అధికారాన్ని నెహ్రూకు కట్టబెట్టేలా చేసింది. దాని పరిణామమే నేటికీ కాశ్మీర్ సమస్య, వేర్పాటువాద సమస్యలు, తీవ్రవాదం వంటివి కొనసాగుతున్నాయి. ఇంగ్లీష్ వాళ్లను వెళ్లగొట్టినా వాళ్ల డీఎన్ఏ నేటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాంగ్రెస్ ను నడిపిస్తున్నది. నేటికీ కాంగ్రెస్ విభజించు పాలించు విధానాలు, వారసత్వ రాజకీయాలు, సంతృప్తీకరణ, అవినీతికి పెద్దపీట వేస్తూ దేశాన్ని పట్టిపీడిస్తున్నది. ఇది ఒక ప్రైవేటు కంపెనీగా మారింది.

పార్టీయేతర శక్తులుగా గాంధీలు!

ప్రధానంగా జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు వారసత్వ రాజకీయాలను కొనసాగించడం వల్ల సామర్థ్యం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నత రాజ్యాంగ బాధ్యతలు అందుకోలేకపోతున్నారు. వారసత్వం వల్ల ప్రతిభకు స్థానం లేకుండా పోతున్నది. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ లో ఒకటి లేదా రెండేండ్ల కాలానికి అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం ఉండేది. తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం పర్మినెంటుగా ఒక కుటుంబం చేతిలోకి వెళ్లింది. ఆ విధానమే ఎమర్జెన్సీని తెచ్చింది. వాళ్లే పార్టీలో, ప్రభుత్వంలో నిరంతర పాలకులుగా కొనసాగుతున్నారు. ఉదాహరణకు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కాదు, పార్లమెంట్ పార్టీ నాయకుడు కాదు, కానీ రాచరికపు కుటుంబ వారసత్వ నాయకుడిగా కొనసాగుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి కంటే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడి కంటే ప్రాధాన్యం ఉన్న నేతగా వ్యవహరిస్తున్నారు. మీడియా కూడా ఆయనను అలాగే చూపిస్తున్నది. రాహుల్, ప్రియాంక గాంధీలు పార్టీయేతర శక్తులుగా, రాజ్యాంగేతర శక్తులుగా కొనసాగుతున్నారు. కేవలం నెహ్రూ, గాంధీ వారసులు అని చెప్పుకోవడం మినహా వీళ్లకు ఏ ప్రతిభ, నిబద్ధత అవసరం లేదు. వీళ్లకు కనీసం ఒక కేంద్రమంత్రిగా లేదా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అనుభవం లేదు. కానీ వాళ్లు మాత్రం షాడో ప్రధానమంత్రిగా కొనసాగాలని భావిస్తున్నారు. ఇది రేపు దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది.

భారతీయ జనసంఘ్​

రాజ్యాంగం ఆధారంగా ధర్మరాజ్యం(రూల్ ఆఫ్ లా) స్థాపించాలన్న నినాదంతో 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. అదే1980లో బీజేపీగా రూపాంతరం చెంది. అప్పటి నుంచి పార్టీలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం కొనసాగిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. ప్రతి మూడేండ్లకు పార్టీ సభ్యత్వం, పంచాయతీ నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికలు నిర్వహించుకుంటున్నది. ప్రధానులకు, ముఖ్యమంత్రులకు ఎక్కడా వారసత్వం లేదు. 75 ఏండ్ల తర్వాత ఎంతటి వారైనా విరమణ తీసుకోవాల్సిందే. యువతకు అవకాశం ఇవ్వాలనే సత్సంకల్పంతో ఈ నియమం కొనసాగుతున్నది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. అందుకే సామర్థ్యం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నత రాజ్యాంగ పదవులు నిర్వర్తిస్తున్నారు. ఇది మిగతా పార్టీల్లో అసాధ్యంగా మారింది. మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాస్ కు చెందిన నరేంద్ర మోడీ దేశానికి విజయవంతమైన ప్రధానిగా ఎన్నికై పరిపాలిస్తున్నారు. మోడీ క్యాబినెట్ లో మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం లభించింది. 27 మంది బీసీలు,12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు కీలకమైన శాఖల్లో కొనసాగుతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగాలని కోరుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక లాంటి పెద్ద రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం ప్రతి పార్టీలో చట్టబద్ధంగా అమలు కావాలి. రాబోయే ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండాగా మారబోతున్నది. రాజకీయాల్లో ప్రతిభకు న్యాయం జరగాలి, సామర్థ్యం ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఉన్నత రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించే హక్కు కోల్పోరాదు, ప్రజాస్వామ్యం బలోపేతం కావాలి, అవినీతి, నియంతృత్వ విధానాలు నిర్మూలించాలి. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు రాజకీయ సాధికారత నిలబెట్టుకునే అవకాశం కోల్పోరాదన్న నరేంద్ర మోడీ విధానాలు  2024 ఎన్నికలు ప్రధాన ఎజెండాగా ప్రజల ముందు చర్చనీయాంశం కావాలని కోరుకుందాం.

రాచరికపు వారసత్వం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక గణతంత్ర రాజ్యంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, జాతీయతను కాపాడుకుంటూ అన్ని రకాల వివక్షతలను తొలగించుకొని ఒక రాజ్యంగా రూపుదిద్దుకుని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన కొనసాగాలనేది ఆకాంక్ష. ఇదే సమయంలో బహుళ పార్టీల వ్యవస్థ, స్వేచ్ఛాయుత ఎన్నికల వ్యవస్థ, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు పాలన కొనసాగాలని భావించాం. కానీ, ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు తలెత్తడం దురదృష్టకరం. ఒకప్పటి రాచరికపు సంస్థానాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ ఒక కుటుంబానికే పరిమితమైంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల వ్యవస్థ మొదలైంది. ఒక ప్రాంతీయ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏర్పడటం ఆహ్వానించదగినదే, కానీ అది ఒక కుటుంబానికి, వారసత్వానికి పరిమితం కావడం ఆక్షేపించదగినది. ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం చలాయించడం, తద్వారా అవినీతి, అప్రజాస్వామ్యం కొనసాగుతున్నది. ప్రజల ఆకాంక్షకు జవాబుదారీగా ఉండటం లేదు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తిలోదకాలు ఇస్తున్నారు. దేశాన్ని దృష్టిలో ఉంచుకునే 2014లో నరేంద్ర మోడీ “కాంగ్రెస్ ముక్త భారత్’’ అన్న నినాదం ఇచ్చారు. నేడు అదే పార్టీ చైనా, బ్రిటన్, అమెరికాలతో, కొంతమంది విదేశీ శక్తులతో(జార్జ్ సోరస్) చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా బాహాటంగానే మాట్లాడుతున్నది. ఆ పార్టీ నేతలు విదేశాలకు వెళ్లినప్పుడు దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యతిరేక అంతర్గత శక్తులతో చేతులు కలుపుతున్నారు.

నియంతృత్వ విధానం

కాంగ్రెస్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముఖ్యమంత్రి అయినా గాంధీ కుటుంబ దయాదాక్షిణ్యాల మీదనే కొనసాగాలి. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి శరద్​పవార్​వరకు, ఈ మధ్య 23 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు వరకు కుటుంబ పాలన నియంతృత్వానికి బలవుతున్నారు. 70వ దశకంలో కుటుంబ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ రెండుగా చీలింది. అప్పటి నుంచి ఇందిరా కాంగ్రెస్​గా చెలామణి అవుతూ ముందుకు పోతున్నది. ఇదేవిధంగా ప్రాంతీయ పార్టీలు వాళ్ల కుటుంబ ఆధిపత్యాన్ని, వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. అక్కడికే పరిమితం కాకుండా.. తమ అధికారాన్ని కాపాడుకునేందుకు విపరీతమైన అవినీతి, తద్వారా నియంతృత్వం, సంతృప్తీకరణ విధానాలు కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు వేర్పాటువాద నినాదాన్ని ఎత్తుకుంటున్నాయి. ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుడైతే ఏకంగా పాకిస్థాన్ నుంచి వచ్చిన వారికి కూడా ఓటుహక్కు కల్పిస్తామన్నారు. కేసీఆర్ కూతురు కాశ్మీర్ కు పోయి కాశ్మీర్ వేర్పాటువాదాన్ని సమర్థిస్తారు. ఆమె సొంత భూమి ఒక్క గజం కూడా వదులుకోరు. కానీ అభివృద్ధికి విరుద్ధంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. కుల, మత, ప్రాంతీయతను రెచ్చగొడుతున్నారు. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే ద్రవిడవాదాన్ని, మమత మత రాజకీయాలను, బీఆర్ఎస్, టీడీపీ వంటి పార్టీలు ఉత్తరాది, దక్షిణాది వాదాన్ని, ఉత్తరాది ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాది, ఆర్జేడీ వంటివి కుల, మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయి.

- నరహరి  వేణుగోపాల్ రెడ్డి,  బీజేపీ రాష్ట్ర నాయకులు