సుభాషణ్… ఆయన పేరుకు తగ్గట్లే సమాజ హితాన్ని కోరుతూ మంచి మాటలు చెప్పేవారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వ్యవస్థపట్ల ఆయనది ఎప్పుడూ ధర్మాగ్రహమే. తెలుగునాట తొలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గానే కాకుండా… హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ విషయంలోనూ జస్టిస్ సుభాషణ్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. కొడుకుల చేతిలో దగా పడిన తల్లులకు సైతం బతుకు చూపించారు. ఫార్మాలిటీస్, ప్రొఫార్మాల జోలికి పోకుండా చిన్న కాగితంపై రాసిన సమస్యనుసైతం ‘హక్కుల పరిరక్షణ’కు స్వీకరించేవారు. హక్కుల విషయంలో ఆయనది ఉక్కు సంకల్పం. అందుకే… జనంతో ‘హక్కు మనిషి’ అనిపించుకున్నారు.
ఏడాదిన్నర క్రితం ఓసారి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి గారిని కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించారు. ‘ఏం జీవన్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది?. ఏమంటోంది?’ అని అడిగారు. దానికి నేను ‘మేము సంతోషంగా లేము సార్. హక్కుల రక్షణ విషయంలో ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోంది’ అని చెప్పాను. మల్లన్న సాగర్ భూసేకరణ వ్యవహారం; ఫార్మాసిటీ కోసం ఇబ్రహీంపట్నం దగ్గర భూసేకరణకు గవర్నమెంట్ గిమ్మిక్కులు చేస్తుండటం; కోదండరాం గారి పట్ల అసహనంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించటం వంటి విషయాలు వివరించాను. అన్నీ విన్న తర్వాత ఆయన స్పందిస్తూ ‘జీవన్.. నేను నెల రోజుల తర్వాత లోకాయుక్తగా పదవీ విరమణ చేస్తున్నా. ఏమైనా ఉంటే ఈ లోపే ఫైల్ చేయి. చూద్దాం’ అన్నారు. సుభాషణ్‌రెడ్డి గారే స్వయంగా ఇలా సూచించటం.. న్యాయం చేయాలనే భావన పట్ల ఆయనలో ఉన్న ఆర్ద్రతకు అద్దం పట్టింది. కానీ.. సుభాషణ్‌రెడ్డి గారు కోరినట్లు ఆయన ముందుకు ఏ సమస్యనూ తీసుకెళ్లలేదు. ఆ తర్వాత సార్‌ని ఎప్పుడూ కలవలేదు.
అంచనాలను మించిన పనితీరు…
2005లో తొలి పూర్తి స్థాయి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమితులైనప్పుడు నాలాంటివారు కొందరు కూడా హర్షం వ్యక్తం చేయలేదు. ‘ఎలా వ్యవహరిస్తారో చూద్దాం’ అన్నారు. కానీ మేం అనుకున్నదానికి భిన్నంగా మానవ హక్కుల కమిషన్‌ను బలోపేతం చేశారు. ప్రజల హక్కుల ఉల్లంఘన అంశాల పరిధిని విస్తృతం చేసి, ఆదేశాల జారీలో అసాధారణ కృషి జరిపారు. సుభాషణ్‌రెడ్డి గారు చేరే నాటికి కమిషన్‌లో ఒక జిల్లా జడ్జి, ఇన్చార్జ్గా నలుగురు గుమస్తాలు, కొంత ఫర్నీచర్ మాత్రమే ఉండేది. ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టి పూర్తి స్థాయి కమిషన్‌కు కావాల్సిన సౌకర్యాలను, కార్యాలయ సిబ్బందిని నియమించటానికి కష్టపడ్డారు. బాధితుల పట్ల, హక్కుల ఉల్లంఘన అంశాలపై సుభాషణ్‌రెడ్డి గారు వ్యవహరించిన తీరు కొద్దికాలంలోనే ప్రజల ప్రశంసలు పొందింది. 1993లో మానవ హక్కుల రక్షణ చట్టం వచ్చిన నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌తోపాటు రాష్ట్ర స్థాయిలో ‘రాష్ట్ర మానవ హక్కుల కమిషన్’లను ఏర్పాటుచేశారు.
చిన్న కాగితం ముక్క మీద రాసిచ్చినా చాలు…
ఈ కమిషన్లు మొదట్లో పోలీసుల, పాలన వ్యవస్థల వల్ల చట్టాల ఉల్లంఘన జరిగినప్పుడు; పౌర, మానవ హక్కులకు ప్రమాదం ఏర్పడినప్పుడు నివారించి హక్కులను రక్షించటం, ఆ హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పనకు ప్రచారం నిర్వహించటం మాత్రమే పనిగా పెట్టుకున్నాయి. సుభాషణ్‌రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత యాక్టివ్‌గా వ్యవహరించారు. పోలీసులు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల వల్ల జరిగిన హక్కుల ఉల్లంఘనలే కాకుండా ప్రభుత్వేతర సంస్థల విషయంలోనూ జోక్యం చేసుకొని కమిషన్‌లో హక్కుల రక్షణ పరిధిని విస్తృతం చేశారు. కొడుకు తనను సరిగా చూసుకోవట్లేదని ఫిర్యాదు చేసిన తల్లి ముందుకి అతణ్ని రప్పించారు. ఆమెకు నెలనెలా ఇవ్వాల్సిన డబ్బుల లెక్కలు తేల్చిచెప్పారు.
ఒక్క పిటిషన్‌తో అందరికీ రేషన్ కార్డులు…
కొన్ని పోలీస్ కస్టడీ మరణాలకు మేము ఆశించినదానికన్నా ఎక్కువ నష్టపరిహారాన్ని సుభాషణ్‌రెడ్డి గారు సూచించారు. అక్రమ అరెస్టులు, పోలీస్ స్టేషన్లలో చిత్రహింసల విషయంలో కఠినంగా వ్యవహరించి బాధితులకు ఊరట కల్పించారు. ఒక పేదల బస్తీలో ఒకాయన పౌర సరఫరాల శాఖ తనకు రేషన్ కార్డు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. దాన్ని సుభాషణ్‌రెడ్డి గారు పిటిషన్‌గా స్వీకరించి సంబంధిత శాఖకు నోటీసులు పంపారు. తెలంగాణ వ్యక్తి అయిన సుభాషణ్‌రెడ్డి గారి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే మానవ హక్కుల కమిషన్‌కు పూర్వ వైభవం తేవాలి.
తెలంగాణ అంటే ఎంతో ప్రేమ..
ఒకసారి ఓ చిన్న ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగికి సరిగా జీతం ఇవ్వట్లేదన్న ఫిర్యాదు సుభాషణ్‌రెడ్డి గారి ముందుకు వచ్చింది. ఈ విషయంలో ‘కార్మిక శాఖ జోక్యం కోరవచ్చు’ అనే మా సూచనతో లేబర్ కమిషనర్‌కు నోటీసు పంపారు. అనంతరం బాధితుడికి న్యాయం జరిగింది. సుభాషణ్‌రెడ్డి గారికి హైదరాబాద్ అన్నా, తెలంగాణ అన్నా చాలా ప్రేమ. మూసీ నది పరిస్థితిపై వేద కుమార్ గారు, నేను, ‘ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్’ సభ్యులు పాదయాత్ర చేసి సుభాషణ్‌రెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చాం. దాన్ని ఆయన చాలా సీరియస్‌గా తీసుకొని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. మూసీ నది గురించి చాలా విషయాలను మాకు కోర్టులోనే వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు కమిషన్ చైర్మన్‌గా ఆయన పాత్ర అందరికీ తెలిసిందే.
– ఎస్ .జీవన్ కుమార్
మానవ హక్కుల వేదిక