ఆర్బిట్రేషన్​ సెంటర్ ట్రస్టీగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

ఆర్బిట్రేషన్​ సెంటర్ ట్రస్టీగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి
  • జస్టిస్‌ లావు నాగేశ్వరరావు రాజీనామా
  • ఐఏఎంసీలో కీలక పరిణామాలు

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మధ్యవర్తత్వ కేంద్రం(ఐఏఎంసీ) కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐఏఎంసీ వ్యవస్థాపక ట్రస్టీ పదవికి విశ్రాంత జస్టిస్‌ లావు నాగేశ్వరరావు రాజీనామా చేశారు. నూతన శాశ్వత ట్రస్టీగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2019లో హైదరాబాద్‌ లో శాశ్వత ట్రస్టీగా జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు. ట్రస్టీలుగా జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్, నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లిలతో ఈ సెంటర్ ఏర్పాటైంది. వ్యక్తిగత కారణాల వల్ల జస్టిస్‌ లావు నాగేశ్వరరావు రాజీనామా చేసినట్లు తెలిసింది.

ఐఏఎంసీ మార్గదర్శకాల్లో ట్రస్టీలుగా కొనసాగే వాళ్లు మధ్యవర్తిత్వం లేదా ఆర్బిట్రేషన్‌ కేసుల్ని పరిష్కరించేందుకు వీల్లేదు. ఈ నిబంధన కారణంగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు ఐఏఎంసీకి వచ్చే కేసుల పరిష్కారించే వీల్లేకుండాపోయింది. దీంతో తాను ట్రస్టీగా ఉన్నప్పటికీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కేసుల్ని పరిష్కారం చేయలేకపోతున్నాననే భావనతో శాశ్వత ట్రస్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వ నిధులతో గుజరాత్‌లో ఏర్పాటు

హైదరాబాద్‌ ఐఏఎంసీని నీరుగార్చాలనే ప్రయత్నం సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేశారనే విమర్శలు లేకపోలేదు. గుజరాత్‌లో  మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా దానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులను కేటాయించారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా హైదరాబాద్‌ ఐఏఎంసీని దెబ్బతీసే ప్రయత్నమని విమర్శలు వచ్చాయి. అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన కొందరు హైదరాబాద్‌ ఐఏఎంసీ పట్ల సానుకూలంగా లేరు.. ఆయా లాబీల కుయుక్తుల కారణంగా ఐఏఎంసీ పురోగమనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అంతర్జాతీయ వేదికల ద్వారా హైదరాబాద్‌ ఐఏఎంసీలో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులపై ప్రాచుర్యం కల్పించేందుకు ఆశించిన స్థాయిలో ప్రయత్నాలు జరగలేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్బిట్రేషన్‌- మీడియేషన్‌ సెంటర్‌ అంటే ఢిల్లీ, ముంబై అనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ఐఏఎంసీ పురోగతికి నూతన ట్రస్టీ జస్టిస్‌ సుదర్మన్‌రెడ్డి ప్రత్యేక చొరవ, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 

రూ.50 వేలకే మీడియేషన్​పై ట్రైనింగ్ 

సమస్యలను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునే విధానం భారతీయ జీవన విధానంలోనే ఉందని తరుచుగా చెప్పే జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్‌లో ఐఏఎంసీని ఏర్పాటు చేయాలని 2019లో సంకల్పించారు. ఆనాటి సీఎం కేసీఆర్ ద్వారా కార్యరూపంలోకి తెచ్చారు.

ప్రస్తుతం అదే విధమైన సహకారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అంతర్జాతీయ గుర్తుంపు ఉన్న ఈ సెంటర్​లో మీడియేషన్‌, -ఆర్బిట్రేషన్‌పై కేవలం రూ.50 వేలతోనే ట్రైనింగ్ అవకాశం ఉందనే విషయాన్ని ప్రాచుర్యంలోకి తేవాల్సివుంది.