న్యాయ సహాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి : సుజయ్ పాల్

  • హైకోర్టు జస్టిస్ సుజయ్ పాల్ 

హనుమకొండ సిటీ/ ములుగు/ తొర్రూరు, వెలుగు: ఉచిత న్యాయ సహాయం అనేది స్వాతంత్రం రాక ముందు నుంచే ఉందని, దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. శనివారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవాధికార ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హైకోర్టు జస్టిస్ సుజయ్ పాల్ చీఫ్​గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ప్రజలకు న్యాయం అందించేందుకు క్షేత్రస్థాయిలో కార్యనిర్వాహకులు చొరవ తీసుకుని పని చేయాలన్నారు. 

రాష్ర్టంలో న్యాయ సేవా సంస్థలు చిత్తశుద్ధితో పని చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రన్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి జస్టిస్ పంచాక్షరి మాట్లాడుతూ సత్వర న్యాయం, సమన్యాయం న్యాయ సేవాధికార సంస్థల విశిష్టతలను గ్రామస్థాయిల్లో విస్తృతపర్చాలన్నారు. అనంతరం గురుదేవా చారిటబుల్ ట్రస్ట్, కేఎస్ఎం ఫౌండేషన్ల ద్వారా వైకల్యం ఉన్న వారికి లింబ్స్, వీల్ చైర్లు, ట్రైసైకిల్స్, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్లు బీవీ నిర్మలా గీతాంబ, సీహెచ్ రమేశ్​బాబు, కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారదాదేవి, వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా, న్యాయ సేవాధికారసంస్థల కార్యదర్శులు సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్లు సిరికొండ సంజీవరావు, బైరపాక జయాకర్ తదితరులు పాల్గొన్నారు. 

ములుగు జిల్లా కోర్టులో న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవానికి హై కోర్టు న్యాయమూర్తి, ములుగు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి లక్ష్మీనారాయణ అలిశెట్టి హాజరయ్యారు. అంతకుముందు ఆయనకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్వీపీ సూర్య చంద్రకళ, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్​ బొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించి, కోర్టు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. 

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఎస్ విపి సూర్య చంద్రకళ, సీనియర్ సివిల్ జడ్జి టి.కన్నయ్య లాల్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జే.సౌక్య తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్​జిల్లా తొర్రూరు లయన్స్​క్లబ్​టీచర్స్​అధ్యక్షుడు చింత సురేశ్​ఆధ్వర్యంలో జాతీయ న్యాయసేవా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తొర్రూరులో సేవలందిస్తున్న న్యాయవాదులను సన్మానించారు. కార్యక్రమంలో తొర్రూరు ఏజీపీ బండపల్లి వెంకన్న, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కలువకొలను ప్రవీణ్ రాజు, న్యాయవాదులు, లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ టీచర్స్ చార్టర్ అధ్యక్షుడు సూరం ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.