న్యాయ వ్యవస్థలో లాయర్లు, ఉద్యోగులూ కీలకమే

  • తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్

సికింద్రాబాద్, వెలుగు:  న్యాయవ్యవస్థలో తీర్పులు వెలువరించడంలో జడ్జిలతో పాటు లాయర్లు, జ్యుడీషియల్ ఉద్యోగుల పాత్ర కూడా కీలకమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. అందరి సమష్టి కృషి ఫలితంగానే కేసుల పరిష్కారం విజయవంతంగా జరుగుతుందని చెప్పారు. గురువారం సికింద్రాబాద్‌‌లోని జ్యుడీషియల్ అకాడమీలో తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘‘గతంలో జ్యుడీషియరీలో పరిస్థితులు వేరుగా ఉండేవి. న్యాయమూర్తి  అంటేనే ఎవరితోనూ కలవకూడని పరిస్థితులు ఉండేవి. 

ALSO READ: ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం

ఇప్పుడు అలా లేదు. కోర్టుల్లో పనిచేసే వారంతా సమష్టిగా కృషి చేయడం వల్లే కేసులు త్వరితగతంగా పరిష్కారమవుతున్నాయి” అని చెప్పారు. ప్రజలు చివరి అవకాశంగా న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తారని, కేసులను క్షుణ్నంగా పరిశీలించి వారికి సరైన విధంగా న్యాయం జరిగేలా న్యాయమూర్తులు, లాయర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను సుప్రీం కోర్టుకు వెళ్తున్నా.. తెలంగాణ హైకోర్టుతో తనకు ఉన్న అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. జ్యుడీషియరీ సక్రమంగా నడవాలంటే ఇన్​ఫ్రాస్ర్టక్చర్ సరిగ్గా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్​రావు అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ నవీన్​రావులను ఉద్యోగుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆలిండియా జ్యుడీషియల్ కాన్ఫిడరేషన్ జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్​వీ సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి వీవీ రమణారావు, జోనల్ సెక్రటరీ జగన్నాథం పాల్గొన్నారు.