హైకోర్టు న్యాయమూర్తి అనుచిత వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందా.?

హైకోర్టు న్యాయమూర్తి అనుచిత వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందా.?

ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ తన ‘ఎక్స్’లో ఈ పోస్ట్​ పెట్టారు. దాంతో  దేశంలోని అందరి దృష్టి కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీశానంద వైపు మళ్లింది. ఆమె పోస్ట్​లో సంభాషణ ఇలా ఉంది..

న్యాయమూర్తి: కాగితం అందుబాటులో ఉంది కాబట్టి కూర్చొని రాయవచ్చు. (దీని ఉద్దేశ్యం తెలియదు) అతను ఇంటికి వెళ్తాడా?  మూడు సంవత్సరాలు జైలుకి వెళ్తాడా? అర్థమైందా మీకు?

మగ న్యాయవాది: అర్థమైంది.

న్యాయమూర్తి: ఆయనకి బుక్స్ ఆఫ్​ అకౌంట్స్​ ఉందా?  ఇన్​కం ట్యాక్స్​ అసెస్సీనా?

మహిళా న్యాయవాది:  అవును. అతను ఇన్​కం ట్యాక్స్​ అసెస్సీనే.

న్యాయమూర్తి:   కొంచెం ఆగమ్మా. మీరెందుకు 

చెబుతున్నారు?  అతని గురించి మీకు అంతా తెలుసు.  అతను ఏ రంగులో ఉన్న లోదుస్తులు  వేసుకున్నాడో కూడా రేపు మీరు చెబుతారు. కాగా, ఈ వ్యాఖ్యలను చేసింది కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీశానంద. ఈ వీడియోతోపాటు మరో వీడియో సాంఘిక మాధ్యమాల్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నది. యజమాని, కిరాయిదారుకి సంబంధించిన ఓ కేసులో ఆ న్యాయమూర్తి ముస్లింలు ఎక్కువగా ఉన్న బెంగళూరులోని ఓ ప్రాంతాన్ని పాకిస్థాన్​గా అభివర్ణించారు.  న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సాంఘిక మాధ్యమాల్లో వైరల్​ అయిన తరువాత కర్నాటక హైకోర్టు తన యూట్యూబ్​ చానల్​ లైవ్​ స్ట్రీమింగ్,  రికార్డింగ్​ ఆఫ్​ ప్రొసీడింగ్స్ 2021పై  ఓ డిస్ క్లైమర్ ని  ఉంచింది.  రాతపూర్వక  అనుమతి లేకుండా వీటిని తిరిగి ప్రసారం చేయడం కానీ,  ప్రచురించడం కానీ చేయరాదని పేర్కొంది.  ఈ క్రమంలో బెంగళూరు న్యాయవాదుల  సంఘం  ప్రతిస్పందన విపరీతంగా ఉంది.  కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయాలని కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని  న్యాయవాదుల సంఘం అభ్యర్థించింది.  ప్రత్యక్ష  ప్రసారాలని నిలిపివేయకపోతే  పరిస్థితి మరింత దిగజారుతుందని,  బహిరంగ కోర్టుల ప్రతిష్ట మరింత మసకబారుతుందని పేర్కొంది.  జస్టిస్​ శ్రీశానంద మంచి న్యాయమూర్తి అని కూడా న్యాయవాదుల సంఘం పేర్కొంది. జరిగింది ఒకటైతే న్యాయవాదుల సంఘం కోరింది మరొకటి. 

వ్యాఖ్యలపై సుప్రీం ఉత్తర్వులు

జస్టిస్​ శ్రీశానాంద చేసిన  రెండు వ్యాఖ్యలు  వీడియోలు వైరల్ అయిన తరువాత  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​  డీవై చంద్రచూడ్​ అధ్యక్షతన నలుగురు సీనియర్​ న్యాయమూర్తులతో కూడిన బెంచ్​ అత్యవసరంగా ఏర్పాటు చేసి తమకు తాముగా ఈ వ్యాఖ్యలని గుర్తించి కొన్ని ఉత్తర్వులను జారీ చేశారు.  కర్నాటక  హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి నుంచి పరిపాలనాపరమైన ఆదేశాలను స్వీకరించి నివేదికను సమర్పించాలని కర్నాటక హైకోర్టు రిజిస్ట్రార్​ జనరల్​ని  సుప్రీంకోర్టు  బెంచ్​ ఆదేశించింది.  న్యాయమూర్తుల ప్రవర్తనపై కొన్ని మార్గదర్శకాలను సూచించమని భారత ఆటార్నీ జనరల్​కి సూచించింది. ‘‘సాంఘిక మాధ్యమాల యుగంలో మనల్ని  ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దు. అందుకు తగినట్టుగా మనం వ్యవహరించాలి” అని భారత ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా  అన్నారు. కాగా, ఎవరీ జస్టిస్​ శ్రీశానంద అంటే,  మే4, 2020న జస్టిస్​ శ్రీశానంద కర్నాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మార్చి 28, 2028న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. 

హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే..

హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే రాజ్యాంగంలో  చెప్పినవిధంగా, జడ్జెస్​ ఎంక్వైరీ చట్టం 1968 ప్రకారం జరగాలి.  హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడం కానీ,  సస్పెండ్​ చేయడం కానీ సుప్రీంకోర్టు న్యాయపరంగా కూడా చేయలేదు. ఈ విషయం గురించి రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు.  న్యాయపరంగా సుప్రీంకోర్టు ఆ న్యాయమూర్తిని ఖండించవచ్చు. సాంఘిక మాధ్యమాల కాలంలో అవసరమైన మార్గదర్శకాలను నిర్దేశించవచ్చు. ఆ మార్గదర్శకాలు గతానికి వర్తించేవిధంగా ఉండే అవకాశం లేదు.  సుప్రీంకోర్టు అవసరమని భావిస్తే ఆ న్యాయమూర్తికి  జ్యుడీషియల్​ వర్క్​ ఇవ్వకుండా ఆపేయమని  కర్నాటక  హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తిని  కోరవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకుమించి మరేమీ చేయడానికి అవకాశం లేదు. 

జ్యుడీషియల్​ అకాడమీ కృషి చేయాలి

జస్టిస్​ శ్రీశానంద కేసు ద్వారా న్యాయమూర్తుల  జవాబుదారీతనం  మరోసారి  చర్చకు  వచ్చింది.  దీనిగురించి చర్చించి, అవసరమైన మెకానిజమ్ ని కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది.  న్యాయవ్యవస్థ స్వతంత్రతకి  భంగం కలగకుండా దీన్ని ఎలా సాధించగలమన్నది  అంతుచిక్కని  ప్రశ్న.  శ్రీశానంద అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సాంఘిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి తుపాను​ సృష్టించవచ్చు. ఈ  తుపాను​ న్యాయమూర్తులకు  అపరిమిత అధికారాలను మంజూరు చేసిందని మరోసారి  మనకు  గుర్తు చేస్తుందా?  నిజానికి న్యాయమూర్తులు తమకు తామే లేదా ఒకరి మీద మరొకరి ఒత్తిడి ద్వారా వీటిని నియంత్రించే 
ప్రయత్నం చేయాలి.  జాతీయ జ్యుడీషియల్ అకాడమీ అందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.  లేకపోతే అది  ఆ కాన్ఫరెన్స్​లు  పెయిడ్​ హాలిడే అపవాదుని  కొనసాగించినట్లుగా ఉంటుంది. 

సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఏం చేయగలదు?

హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగబద్ధంగా నియమించబడినవారు. హైకోర్టు న్యాయమూర్తుల మీద సుప్రీంకోర్టు ఎలాంటి క్రమశిక్షణ చర్యలను తీసుకోలేదు. జస్టిస్ శ్రీశానంద చేసిన వ్యాఖ్యలు మౌఖికమైనవి. అవి ఉత్తర్వులలో లేవు. అందుకని సుప్రీంకోర్టు తీసివేసే అవకాశాలు కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని విచారణకు తీసుకున్నప్పటికీ, రాజ్యాంగంలో చెప్పిన విషయాలకు అతీతంగా సుప్రీంకోర్టు ఈ విషయంలో చర్చని తీసుకోలేదు. అంతర్గత విచారణని  సుప్రీంకోర్టు  చేపట్టవచ్చు.  అది కూడా పాలనాపరమైనది.  

రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ ఇలా..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (4) (5) , ఆర్టికల్​ 218 ప్రకారం .. నిరూపించబడిన చెడుప్రవర్తన  లేదా అసమర్థత కారణంగా సుప్రీంకోర్టు,  హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే చర్యలను ప్రారంభించే అధికారం పార్లమెంట్ సభ్యులకు ఉంది.  ఈ చెడు ప్రవర్తన లేదా అసమర్థత గురించి దర్యాప్తు,  రుజువు చేసే  ప్రక్రియను జడ్జెస్​ ఎంక్వైరీ చట్టం 1968లో  తెలిపారు. ఈ విషయాన్ని  పార్లమెంట్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తారు.  ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే  ‘దుష్ర్పవర్తన’ అవుతుందని  క్రిష్ణస్వామి వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసులో  సుప్రీంకోర్టు న్యాయమూర్తి  కె.రామస్వామి అన్నారు.  ఈ ప్రవర్తన  న్యాయస్థానం లోపలే కాకుండా వెలుపల  కూడా వర్తిస్తుందని అన్నారు.  1968  చట్టప్రకారం  సుప్రీంకోర్టు,  హైకోర్టు  న్యాయమూర్తులని  తొలగించే తీర్మానాన్ని  పార్లమెంట్​లోని  ఏ సభలోనైనా  సమర్పించవచ్చు.  అయితే,  కనీసం 100 మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని రాజ్యసభలో  ప్రవేశపెట్టాలంటే  సభలోని  కనీసం 50మంది సభ్యులు దానిపై సంతకం చేయాలి.  ఇప్పటివరకు చాలా అభిశంసన తీర్మానాలు పార్లమెంటులోకి వచ్చాయి. ఏవీ కూడా సఫలం కాలేదు.  


- డా. మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి (రిటైర్డ్​)