కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల, వెలుగు: గ్రామాల్లోని పేద దళితులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి అందించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందని, కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ఆలోచనా విధానాలతోనే దేశం అభివృద్ధి చెందిందన్నారు. 2004లో వరికి మద్దతు ధర రూ.500 ఉండగా 2014 వరకు దాన్ని రూ.1,350కి పెంచామన్నారు. నేటి ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు కేవలం రూ.1,350 నుంచి రూ,2060 వరకు మాత్రమే పెంచిందని గుర్తు చేశారు. కొత్త పథకాలు రూపొందించడమంటే పాతవాటికి మంగళం పాడేయడమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రతినెల ఒకటో తారీకున పెన్షన్ ఇచ్చే వారమని, టీఆర్ఎస్ పాలనలో గత అక్టోబర్ పింఛన్డిసెంబర్ లో ఇస్తుండడం వారి పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్ రావు, లీడర్లు రాజారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
లిక్కర్ అమ్మకాలపైనే బీఆర్ఎస్ శ్రద్ధ
కరీంనగర్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్కు లిక్కర్ అమ్మకాలు పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ మహిళల అభివృద్ధిపై లేదని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి బొమ్మ జయశ్రీ ఆరోపించారు. సోమవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. వృద్ధాప్య, మహిళ, వితంతు, ఒంటరి మహిళా పింఛన్లు మంజూరు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ప్రైవేటు రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని, డ్వాక్రా మహిళా స్వశక్తి గ్రూపులను బలోపేతం చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో మహిళా బీజేపీ జిల్లాధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభ తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్టపతిని కలిసిన ఎమ్మెల్సీ కౌశిక్
జమ్మికుంట, వెలుగు : భారత రాష్ర్టపతి ద్రౌపది ముర్మును ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి మండలి సభ్యులతోపాటు వెళ్లిన కౌశిక్ రెడ్డి ముర్ముకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
చొప్పదండి, వెలుగు: పట్టణంలోని ప్రతిభా విద్యానికేతన్ స్కూల్‌కు చెందిన 2003 –04లో పదో తరగతి చదివిన 45 మంది పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి టీచర్లతోపాటు విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీచర్లను, అటెండర్‌ను శాలువాలతో సత్కరించారు. అనంతరం టీచర్ల చేతుల మీదుగా విద్యార్థులు షీల్డ్ లు అందుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు రాజయ్య, శంకరయ్య, రాజు, ప్రేంసాగర్, రాజేశం, ఆనందం, వెంకట్‌రెడ్డి, మల్లేశం, వెంకటేశ్వర్లు, అంజలి, అరుణ, విద్యార్థులు పాల్గొన్నారు.
‘అభివృద్ధిని చూసి బీజేపీలో చేరుతున్నరు’
పెద్దపల్లి, వెలుగు: ప్రధాని మోడీ దేశంలో చేస్తున్న అభివృద్ధిని చూసి పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని పెద్దపల్లి బీజేపీ లీడర్ గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో 150 మంది హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేర్చేందుకు లీడర్లను తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్.సజ్జాద్, వి.శ్రీధర్ పటేల్, వి.భూమయ్య, బి.సతీశ్‌గౌడ్, ఎ.శ్రీనివాస్, వి.తిరుపతి, కె. శ్రీనివాస్, తిరుపతి, టి.రాజేశ్, బి.రాజేష్, పి.శ్రీధర్, ఎం.సతీశ్, ఎం.రవి, ప్రవీణ్ పాల్గొన్నారు.
వైభవంగా అయ్యప్ప పడిపూజ
కోరుట్ల, మెట్ పల్లి, జమ్మికుంట, వెలుగు : కోరుట్ల, మెట్ పల్లి, జమ్మికుంట మండలాల్లో సోమవారం అయ్యప్ప మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. కోరుట్ల కాలేజీ గ్రౌండ్ దుర్గా దేవాలయం ఆవరణలో జరిగిన పూజలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బీజేపీ కౌన్సిలర్ గణేశ్, బీజేపీ కోరుట్ల నియోజకవర్గ లీడర్నవీన్ కుమార్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అనిల్, భక్తులు పాల్గొన్నారు. మెట్ పల్లి అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుస్వామి, ఆలయ అర్చకులు స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. జమ్మికుంట అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవాలు ముగిశాయి. ఉదయం నుంచి ఆలయంలో గణపతి హోమం, కలశ పూజ, మండపారాధన నిర్వహించారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజలు 41 రోజులపాటు ఘనంగా నిర్వహించారు.