అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు జడ్జిగా జస్టిస్‌‌‌‌‌‌‌‌ వర్మ ప్రమాణం

అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు జడ్జిగా జస్టిస్‌‌‌‌‌‌‌‌ వర్మ ప్రమాణం
  • నోట్ల కట్టల కేసు పెండింగ్ లో ఉండడంతో కేసుల విచారణకు నో పర్మిషన్
  • సాధారణ వేడుకకు భిన్నంగా చాంబర్​లో ప్రమాణ కార్యక్రమం

అలహాబాద్: నోట్ల కట్టల జడ్జి, జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్​హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. తన నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడడంతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇన్​హౌస్ ఎంక్వైరీ ఎదుర్కొంటున్న వర్మకు ఎలాంటి కేసు విచారణలు, జ్యుడీషియల్ పనులు అప్పగించకూడదని నిర్ణయించారు. అలహాబాద్ హైకోర్టు సీజే తర్వాత సీనియారిటీలో జస్టిస్ యశ్వత్​వర్మ ఆరో స్థానంలో ఉన్నారు. సాధారణంగా న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార వేడుకలకు భిన్నంగా, జస్టిస్ వర్మ ఒక ప్రైవేట్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు.

 గతంలో  సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు అతని బదిలీపై అలహాబాద్ బార్ అసోసియేషన్ నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ, మార్చి 28న ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపించినట్లు కేంద్రం ప్రభుత్వం తెలియజేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులను సహించబోమని బార్ అసోసియేషన్ నిరవధిక సమ్మెను ప్రారంభించింది. 

అయితే, డిమాండ్ పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా హామీ ఇవ్వడంతో వారు సమ్మె నిలిపివేశారు. మరోవైపు గత వారం జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది, పిటిషన్​ను ‘ప్రీమెచ్యూర్’ అని పేర్కొంది. ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నదని, విచారణ ముగిసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.