కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా

కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా

ఒట్టావా: కెనడా దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా నాయకత్వానికి కూడా ఆయన గుడ్ బై చెప్పారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపధర్మ ప్రధానిగా కొనసాగుతానని ప్రకటించారు. ఒట్టావాలోని రైడో కాటేజ్‌లోని తన నివాసంలో ట్రూడో సోమవారం (జవనరి 6) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను పార్టీ నాయకత్వంతో పాటు కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఈ విషయం ఇప్పటికే పార్టీకి, గవర్నర్‎కు తెలియజేశాను. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపధర్మ ప్రధానిగా కొనసాగుతా’’ అని అన్నారు. 

53 ఏళ్ల ట్రూడో నవంబర్ 2015లో కెనడా పీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రెండు టర్ముల్లో మొత్తం 9 ఏళ్లు ఆయన ప్రధానిగా పని చేశారు. తద్వారా కెనడాలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రులలో ఒకరిగా నిలిచారు. అయితే, గత రెండు సంవత్సరాలుగా ట్రూడోకు ఇంటా బయటకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కెనడా ఆర్థి్క పరిస్థితి దారుణంగా పడిపోవడంతో ట్రూడో నిర్ణయాలు కొన్ని రాజకీయంగానూ అధికార పార్టీకి సమస్యగా మారాయి. మరీ ముఖ్యంగా ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్ హత్య కేసులో భారత్ తో ట్రూడో వ్యవహరించిన తీరు ఆయనకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

ట్రూడో తీరుతో భారత్, కెనడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నాయంటే పరిస్థితి ఎక్కడికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది చివర్లో కెనడా పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రూడో నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే భారీ దెబ్బ తప్పదని అధికార పార్టీ ముందుగానే గ్రహించింది. ఈ నేపథ్యంలోనే ట్రూడో రాజీనామా చేయాలని సొంత పార్టీ నుండి డిమాండ్లు మొదలయ్యాయి. ఇటీవల ట్రూడో కేబినెట్ లోని కెనడా ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా చేయడంతో ట్రూడోపై రాజీనామా ఒత్తిళ్లు మరింత అధికం అయ్యాయి. దీంతో చేసేదేమి లేక ట్రూడో తన ప్రధానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.