- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పై డీజీపీకి ఫిర్యాదు చేస్త
- ఫోన్ ట్యాపింగ్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని వ్యాఖ్య
కరీంనగర్, వెలుగు : తన ఫోన్ ట్యాప్ చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావేనని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ చార్జ్ జువ్వాడి నర్సింగారావు ఆరోపించారు. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జువ్వాడి నర్సింగారావు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం కరీంనగర్ డీసీసీ ఆఫీసులో మీడియాతో నర్సింగారావు మాట్లాడారు.
‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో నేను గెలుస్తానని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ నా గెలుపును అడ్డుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సర్వశక్తులు ఒడ్డారు. నా సమాచారాన్ని ముందే తెలుసుకుని అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల సమయంలో మేం మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు” అని ఆరోపించారు. తనపై పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్.. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, ఆయనకు నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ తో కాపురాలు కూల్చారు..
ఫోన్ ట్యాపింగ్ వల్ల గతంలో ప్రభుత్వాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని నర్సింగరావు అన్నారు. ‘‘కేసీఆర్ కు తన సొంత కుటుంబ సభ్యుల మీద కూడా నమ్మకం లేదు. చివరికి వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం సిగ్గుచేటు. మీడియా ప్రతినిధులు, మేనేజ్ మెంట్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేశారు. సీబీఐ విచారణ జరుగుతున్న భూములను సైతం కబ్జా చేశారు. సినీ నటుల దంపతుల ఫోన్లను ట్యాప్ చేసి, వారి కాపురాలు కూల్చివేశారు” అని మండిపడ్డారు.
ప్రజలు తిరగబడతారనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రాన్ని నిండాముంచిందని, లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని అన్నారు. ‘‘గతంలో కేసీఆర్ కుటుంబానికి కారులో డీజిల్ పోసుకునే స్తోమత కూడా లేదు. కానీ ఇప్పుడు లక్షల కోట్లకు ఎదిగారు. 20 ఎకరాల ఫామ్ హౌస్.. ఇప్పుడు 100 ఎకరాల ఫామ్ హౌస్ అయింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?” అని ప్రశ్నించారు.