గ్రూప్‌‌1 అభ్యర్థులకు న్యాయం చేయాలి : జక్కని సంజయ్‌‌ కుమార్‌‌

గ్రూప్‌‌1 అభ్యర్థులకు న్యాయం చేయాలి : జక్కని సంజయ్‌‌ కుమార్‌‌
  • స్టూడెంట్లకు నష్టం చేసే జీవో 29ను రద్దు చేయాలి: జక్కని సంజయ్‌‌ కుమార్‌‌ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో జీవో 29ను వెంటనే రద్దు చేసి, గ్రూప్‌‌ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్‌‌ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్‌‌ కుమార్‌‌ డిమాండ్‌‌ చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌ అంబేద్కర్‌‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న గ్రూప్‌‌1 అభ్యర్థులకు జక్కని సంజయ్‌‌ కుమార్‌‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం అగ్రవర్ణాలకు ఉద్యోగాలను కట్టబెట్టడానికి సీఎం రేవంత్‌‌ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఆరోపించారు. గ్రూప్‌‌1 నియామకాల్లోనూ జీవో 54 రద్దు చేసి, జీవో 29ను అమలు చేస్తూ అగ్రవర్ణ విద్యార్థులకు ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రెడ్ల రాజ్యస్థాపన ధ్యేయంగా సీఎం రేవంత్‌‌ పని చేస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలో అమల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్‌‌ రిజర్వేషన్లు నిజమైన అగ్రవర్ణ పేదలకు దక్కేలా సవరించాలని, లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా విద్యార్థులు పోరాటం చేస్తారని హెచ్చరించారు. అణగారిన వర్గాల పట్ల మొదటి నుంచి అణిచివేత ధోరణితోనే కాంగ్రెస్‌‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో ఉదయ్‌‌పూర్‌‌ డిక్లరేషన్‌‌ తుంగలో తొక్కారని విమర్శించారు. ఎంపీ సీట్ల కేటాయింపులోనూ అణగారిన వర్గాలను మోసం చేశారన్నారు. నామినే-టె-డ్‌‌ పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టులను అగ్రవర్ణాలకు కేటాయిస్తూ బహుజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు.