
పటాన్చెరు, వెలుగు : పటాన్చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు ఇప్పుడు రెవెన్యూ డివజన్, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందనుందని తెలిపారు. ఇప్పటివరకు సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లో రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం మండలాలతో పటాన్చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీకి త్వరలో స్థలం కేటాయించి భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.