ఈ కొండ మీద కొండెక్కని దీపం ఒకటి ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. వేల ఏండ్ల నాటి నుంచి ఈ దీపం ఒక్కసారి కూడా ఆరిపోలేదు. అదొక్కటే కాదు ఈ దీపానికి వత్తి లేదు! ఇంతవరకు ఒక్క చుక్క నూనె కూడా పోయలేదు. అయినా.. భూమి పొరల్లోంచి బయటికి వెలుగు ఇస్తూనే ఉంది.
సాధారణంగా హిందూ దేవాలయాల్లో రాతి లేదా ఏదైనా లోహంతో చేసిన విగ్రహాలను పూజిస్తారు. కానీ.. ఈ అమ్మవారి ఆలయం మాత్రం అందుకు భిన్నం. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉంది జ్వాలాముఖి మాతాజీ ఆలయం . ఇది ఇండియాలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. భూగర్భాన్ని చీల్చుకుని వచ్చే తొమ్మిది జ్వాలలే ఇక్కడ దేవుళ్లు. ఆ జ్వాలలనే పూజిస్తారు ఇక్కడివాళ్లు. ఈ తొమ్మిది జ్వాలలు అమ్మవారి తొమ్మిది రూపాలకు గుర్తులుగా చెప్తుంటారు. ఆలయం లోపల మండుతున్న అతిపెద్ద జ్వాలను ‘జ్వాలా దేవి’ అమ్మవారిగా కొలుస్తారు. మిగతా దీపాలను అన్నపూర్ణ, విద్యావాసిని, చండీ దేవి, మహాలక్ష్మి, హింగ్లాజ్ మాత, సరస్వతీ మాత, అంబికా దేవి, అంజి మాతగా పూజిస్తారు.
మంటలు ఎక్కడ నుండి వస్తున్నాయి?
గుడి అడుగుభాగం నుంచి వచ్చే ఈ తొమ్మిది జ్వాలలకు కారణాలేంటి? సరిగ్గా ఆ తొమ్మిది ప్రదేశాల్లో మాత్రమే జ్వాలలు ఎందుకు వస్తున్నాయి? ఈ గుడిని దర్శించుకుంటే... ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి. కానీ.. వాటికి సైంటిఫిక్ సమాధానాలు ఇప్పటివరకు దొరకలేదు. కొన్ని వేల ఏండ్ల నుంచి ఈ వెలుగులు ఉన్నాయక్కడ. వీటి మీద ఎంతోమంది రీసెర్చ్‌లు చేశారు. అయినా.. అవి వెలగడానికి కావాల్సిన నేచురల్ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? అనేది ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. బ్రిటిష్ వాళ్లు పాలించినప్పుడు కూడా ఈ వెలుగు వెనక రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ.. ఈ మిస్టరీ మాత్రం ఇప్పటికీ తేలలేదు.
ఆర్పాలని ప్రయత్నం
ఆలయ పురాణాల ప్రకారం... ఈ ఆలయం గురించి తెలుసుకున్న మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నిజంగానే అమ్మవారు వెలిశారా? లేదా? అని పరీక్షించాడు. ముందుగా కొన్ని నీళ్లు పోయించి జ్వాలలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. కానీ.. జ్వాలలు ఆరిపోలేదు. ఆ తర్వాత సైన్యంతో ఆలయం లోపలి వరకు నీటి కాలువ తవ్వించాడు. ఆ జ్వాలల మీదుగా ఎంతసేపు నీరు పారినా ఆరిపోలేదు. దాంతో అక్బర్ ఆశ్చర్యపోయి.. అమ్మవారి ఆలయ గోపురం మీదకు ఒక బంగారు గొడుగు సమర్పించాడు.
కానీ.. దేవత అందుకు ఒప్పుకోలేదట. పెట్టిన వెంటనే గొడుగు కింద పడిపోయింది. తర్వాత అది బంగారం లక్షణాలు కోల్పోయి రాగిగా మారిపోయింది. ఇప్పటికీ అక్బర్ సమర్పించిన గొడుగు ఆలయంలో ఉంది. ఈ ఆలయాన్ని ‘జోతావాలి మందిర్, నాగర్‌కోట్, గోరఖ్ దిబ్బి’ అని కూడా పిలుస్తారు.
ఆలయ చరిత్ర
శతాబ్దాల క్రితం ఈ గుడి ఉన్న ప్రాంతంలో ఒక ఆవుల కాపరి తన ఆవుల్ని మేపేవాడు. అయితే.. వాటిలో ఒక ఆవు రోజూ సాయంత్రం పాలు పితికితే ఇచ్చేది కాదు. ఉదయం మాత్రం ఇచ్చేది. దాంతో ఆవు పాలు ఎవరు పితుకుతున్నారో తెలుసుకోవాలని మేపేటప్పుడు దాన్నే గమనించాడు. అంతలోనే ఆవు అడవిలోకి వెళ్లింది. దానివెంటే.. కాపరి కూడా వెళ్లాడు. అక్కడ ఒక అమ్మాయి ఆవు పాలు తాగుతూ కనిపించింది. కాపరి ఆ అమ్మాయిని చూడగానే పెద్ద కాంతి వచ్చింది.
ఆ వెలుగులో అమ్మాయి మాయమైంది. ఆవుల కాపరి రాజు దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పాడు. అయితే.. ఆ ప్రాంతంలో సతీదేవి నాలుక పడిపోయిందనే పురాణగాథ ఆ రాజుకు తెలుసు. అందుకే ఆ పవిత్ర ప్రదేశాన్ని కనుగొనడానికి రాజు ప్రయత్నించాడు. కానీ.. గుర్తించలేకపోయాడు. కొన్నాళ్ల తర్వాత పర్వతాల్లో మండుతున్న మంట చూశానని ఆవుల కాపరి మళ్లీ రాజు దగ్గరికెళ్లి చెప్పాడు. రాజు అక్కడికి వెళ్లి పవిత్ర జ్వాలను దర్శించుకుని, ఆలయాన్ని నిర్మించాడు. మరో జానపద కథలో పాండవులు ఈ ఆలయాన్ని కట్టారని చెప్తుంటారు. ‘‘పంజన్ పంజన్ పాండవన్ తేరా భవన్ బనాయా” అనే జానపద గీతం ఇక్కడి వాళ్లు పాడుతుంటారు.
పురాణాల ప్రకారం..
పురాణాల ప్రకారం.. మండుతున్న హవాన్‌కుండ్‌లోకి దూకి మాతా సతి చనిపోయినప్పుడు.. అమ్మవారి శరీరాన్ని విష్ణువు తన చక్రంతో ఖండిస్తాడు. అప్పుడు సతీదేవి శరీరం 51 ముక్కలుగా మారి భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అవే 51 శక్తిపీఠాలుగా మారాయి. అలా అమ్మవారి నాలుక జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఉన్న స్థలంలో పడిందని ఇక్కడివాళ్లు చెప్తుంటారు.