జగిత్యాల: మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క మృతి చెందడం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని లోటని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రెండు రోజుల క్రితం గుండె వ్యాధితో బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొమిరెడ్డి జ్యోతక్క మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం (నవంబర్ 10) జ్యోతక్క శవయాత్రలో పాల్గొని ఆమె పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొమిరెడ్డి జ్యోతక్క, రాములు తన తండ్రి వెంకటస్వామితో కలిసి బడుగు వర్గాల కోసం పని చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బీసీ, ఎస్సీల కోసం ప్రతి సమావేశంలో ధైర్యంగా మాట్లాడేవారని కొనియాడారు. తల్లి ఆశయాల కోసం ధైర్యంగా జ్యోతక్క కుమారులు పని చేయాలని కోరారు.