పారిస్: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో ఇండియా స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ డబుల్ ధమాకా మోగించింది. కాంపౌండ్ విమెన్స్ టీమ్ ఈవెంట్లో గోల్డ్, వ్యక్తిగత విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలిచింది. మెన్స్ కాంపౌండ్ టీమ్ కూడా బంగారు పతకం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన కాంపౌండ్ విమెన్స్ ఫైనల్లో జ్యోతి సురేఖ–అదితి స్వామి–పర్నీత్ కౌర్‌తో కూడిన ఇండియా టీమ్ 234–233తో మెక్సికోపై గెలిచింది.
ఇక మెన్స్ ఫైనల్లో నాలుగో సీడ్ అభిషేక్ వర్మ–ఓజాస్ దియోతలే–ప్రథమేశ్‌తో కూడిన ఇండియా టీమ్ 236–232తో రెండో సీడ్ అమెరికన్ త్రయం క్రిస్ స్కాఫ్–జేమ్స్ లుట్జ్–సావేర్ సులివాన్‌ను ఓడించి గోల్డ్ మెడల్ నెగ్గింది. కాంపౌండ్ విమెన్స్‌లో గోల్డ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జ్యోతి సురేఖ బ్రాంజ్ తో సరిపెట్టింది. జ్యోతి, సారా లోపెజ్ (స్పెయిన్) మధ్య జరిగిన బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్ 146–146తో సమమైంది. అయితే షూటాఫ్‌లో జ్యోతి పర్ఫెక్ట్ 10 సాధించి మెడల్ నెగ్గింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా రెండు గోల్డ్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించింది.