బడుగులు, దళితులు అంతా మహాత్మా అని గర్వంగా పిలుచుకునే వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. కులం పేరుతో ఎన్నో ఏండ్లుగా అణచివేతకు గురవుతున్న వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి కోట్లాది మంది హక్కులను కాపాడారు. మహిళల ఉద్ధరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారాయన. అందరూ సమాన హక్కులు పొందాలన్న ఉద్దేశంతో సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేసి దీనజనోద్ధరణ కోసం పూలే కృషి చేశారు.
స్వాతంత్య్రానికి పూర్వం సుమారు 650కి పైగా రాజ్యాలు ఉండేవి. వేల సంవత్సరాలుగా వేదాలు, ఉపనిషత్తులు, మనుధర్మ శాస్త్రం లాంటి పురాణాలు ఆచార, సంప్రదాయాల పేరిట మానవ సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించాయి. వాటిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అగ్రకులాలుగా చెబుతూ.. దళితులు, గిరిజనులు మిగతా వృత్తి కులాలను శూద్రులుగా చెబుతూ వారికి సమాజంలో ఎలాంటి హక్కులు లేకుండా చేశారు. ధర్మశాస్త్రాలు వివిధ వర్గాల విధులను ఖరారు చేసి హీనమైన పనుల కోసం ఉపయోగించేవారు. ఈ విధానాన్ని నేడు రాజ్యాంగం, ప్రభుత్వ చట్టాల మాదిరిగా మూడువేల ఏండ్ల పాటు అమలు చేశారు. అందులో బ్రాహ్మణులు విద్యను నేర్చుకోవచ్చు. క్షత్రియులు, వైశ్యులకు ఆ బ్రాహ్మణులు విద్య నేర్పించవచ్చు, యజ్ఞ యాగాదులు చేయవచ్చు. బ్రాహ్మణులు వేదాన్ని వల్లె వేస్తే.. క్షత్రియులు రాజ్య పరిపాలన, వైశ్యులు పాడి పరిశ్రమ, వ్యాపారం చేసేవారు. శూద్రులు, అతి శూద్రులు, స్త్రీలు విద్యను అభ్యసించడం మహాపాపంగా భావించేవారు. ఈ మూడు వర్ణాల వారికి సేవ చేస్తూ.. వారికి వారే సేవ చేసుకుని జీవించాల్సిన పరిస్థితులను కల్పించారు. కాలక్రమేణా వర్ణవ్యవస్థతో పాటుగా వృత్తుల ఆధారంగా శూద్ర, అతిశూద్రులు సుమారు నాలుగు వేల కులాలకు పైగా కుల వివక్షను ఎదుర్కొన్నారు. అందులో కుల కట్టుబాట్లను చట్టబద్ధం చేసి అమలు చేశారు. ప్రస్తుతం రాజ్యాంగానికి విరుద్ధంగా తూచా తప్పకుండా ఆచరణలో ఉన్నవి (1) పుట్టుకతో కులం (2) పుట్టుకతో కుల వృత్తి (3) కంచం పొత్తు (4) మంచం పొత్తు, ఆ కులంలోనే వివాహాలు (5) కుల పంచాయితీ, పై సూత్రాలను ఉల్లంఘిస్తే పంచాయతీ శిక్షల ఖరారు. ఇలా వేల సంవత్సరాలు శూద్ర, అతిశూద్ర కులాలు విద్యకు దూరమయ్యాయి. తీవ్ర అణచివేతను ఎదుర్కొన్నాయి.
పరాభవమే ఆయనను మార్చింది..
1827 కాలంలో మహారాష్ట్రలోని పుణె నగరంలో బ్రాహ్మణులు, పేష్వా రాజుల పరిపాలనలో బ్రాహ్మణేతర కులాలు అమానుషంగా, పశువుల కంటే హీనంగా బతుకుతుండేవి. ఆ టైంలో మాలి కులానికి చెందిన గోవిందరావు పూలే, చిమ్నాబాయి దంపతులకు జ్యోతిబా పూలే జన్మించారు. సరిగ్గా ఆ రోజే పేష్వా రాజుల రాజమహల్ కాలిపోయింది. దాంతో వారి పాలనకు అంతం జరిగిందని అంతా భావించారు. అప్పుడే భారతదేశంలో తమ ఉనికి చాటుకుంటున్న బ్రిటీష్ వారు అనేక గ్రామాల్లో బడులను నెలకొల్పడం ప్రారంభించారు. శూద్ర, అతి శూద్ర కుటుంబాల పిల్లలను కూడా బడులకు రమ్మని పిలిచేవారు. సమాజంలో వేళ్లూనుకుపోయిన కట్టుబాట్లను తెంచుకొని ఎవరూ బడులకు వెళ్లేందుకు సాహసించేవారు కారు. అయినప్పటికీ గోవిందరావు పూలే తన కొడుకును బడికి పంపించాడు. అలా పూలే చదువుకు పునాది పడింది. పూలేకు 13 ఏండ్లప్పుడు 8 ఏండ్లున్న సావిత్రిబాయి పూలేతో పెండ్లి జరిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పూలే చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. తిరిగి 14వ ఏట చదువును ప్రారంభించారు. సమాజంలో కుల వివక్ష అవమానాలను ఎదుర్కొని అజ్ఞానంలో జీవిస్తున్న శూద్ర, అతిశూద్ర సమాజాన్ని జ్ఞాన వంతులుగా మార్చాలంటే చదువు ఒక్కటే మార్గం అని గ్రహించారాయన. పూలే 21వ ఏట బ్రాహ్మణ మిత్రుడిది పెళ్లి ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో తనని శూద్రుడని నిందించడంతో పూలే లో సమాజాన్ని మార్చాలన్న కాంక్ష మరింత బలంగా నాటుకుపోయింది.
సమాజ సేవలో..
పూలే ఆదర్శ దంపతులు ఇతరుల పిల్లలను కూడా తమ పిల్లల్లాగే ప్రేమ, ఆప్యాయతతో ఆదరించేవారు. స్త్రీల విద్య కోసం భార్య సావిత్రిబాయి పూలేను టీచరుగా తీర్చిదిద్ది, దేశంలోనే మొదటిసారి మహిళల కోసం పాఠశాలను స్థాపించారు. పుణె చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది బడులను స్థాపించి శూద్ర, అతిశూద్ర కులాల పిల్లలకు విద్యనందించారు. గర్భిణులకు పూజల పేరుతో చేసే దోపిడీని ‘తృతీయ రత్నం’ అనే నాటిక ద్వారా బయట పెట్టారు. వందలాది వితంతువులకుపెండ్లిళ్లు జరిపించారు. పురోహిత మంత్రాలు లేకుండా వందలాది యువ జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. బ్రిటీష్ ప్రభుత్వం 1882లో ఏర్పాటు చేసిన “హంటర్ కమిషన్”కు విజ్ఞాపన పత్రం ద్వారా దేశంలోని శూద్ర, అతిశూద్ర, స్త్రీలకు విద్యను అందించాలని సూచించారు. వారి కోసం అనేక నీటి బావులు తవ్వించారు. బ్రాహ్మణులు వారి కోసం రాసుకున్న వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను నమ్మొద్దని సమాజానికి చాటి చెప్పారు పూలే. బానిసత్వానికి వ్యతిరేక బావుటగా నిలిచే విధంగా ‘గులాంగిరి/బానిసత్వం’ అనే గ్రంథాన్ని మరాఠ భాషలో రచించారు. ఆ గ్రంథాన్ని అన్ని భాషల్లోకి అనువదించి, వెనుకబడ్డ ప్రతి ఒక్కరిలో ఆలోచన అనే అగ్నిని రగిల్చాడు. అమానుష సంప్రదాయాల పేరుతో అబద్ధాలు చెప్పిన మత గ్రంథాలను వ్యతిరేకిస్తూ కుల రహిత సమాజం కోసం పాటుపడ్డారు.
‘అవిద్య’తోనే అన్ని అనర్థాలు..
సత్యాన్ని శోధించి, ఛేదించి అజ్ఞానులను, జ్ఞానవంతులు చేయాలనే ఆలోచనతో ‘సత్యశోధక్ సమాజాన్ని’ స్థాపించారు పూలే. ఆయన రచించిన మరో గ్రంథం ‘రైతు చేతికి కొరడా’. ఆ పుస్తకం ముందు మాటలో.. శూద్రులకు విద్యా లేనందున జ్ఞానం లేకుండా పోయింది.. జ్ఞానం లేనందున నైతికత లేకుండా పోయింది.. నైతికత లేనందున ఐకమత్యం లేకుండాపోయింది.. ఐకమత్యం లేనందున శక్తి లేకుండా పోయింది.. శక్తి లేనందున శూద్రులు అణచివేతకు గురయ్యారు.. ఇన్ని అనర్థాలకు అవిద్యే కారణం అని ప్రజలకు తెలియ చెప్పాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మా పూలేకు స్వయంగా సంబంధం లేకున్నా, ఆయన పూలే రచనలకు ప్రభావితమై తన జీవితాన్ని దేశ ప్రజల కోసం అంకితం చేశారు. పూలేను తన మొదటి గురువు అని అంబేద్కర్ స్వయంగా చెప్పేవారు. పూలే 26 నవంబర్ 1890న మరణించారు.