సింధియా సరదాగా క్రికెట్ ఆడితే.. కార్యకర్త తల పగలింది

సింధియా సరదాగా క్రికెట్ ఆడితే.. కార్యకర్త తల పగలింది

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో కొట్టిన షాట్‌కు బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. తలకు బంతి బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అతడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని ఇటౌరాలో బుధవారం (ఈనెల 15న) ఈ ఘటన జరిగింది.

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇటౌరాలో కొత్తగా ఒక స్టేడియాన్ని నిర్మించింది. ఇటీవలే ప్రారంభించిన స్టేడియానికి వెళ్లిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. అక్కడ కాసేపు సరదాగా బీజేపీ కార్యకర్తలతో క్రికెట్ ఆడారు. ఈ క్రమంలో సింధియా బ్యాటింగ్ చేస్తుండగా కొట్టిన బంతిని క్యాచ్‌ పట్టేందుకు వికాస్‌ మిశ్రా అనే బీజేపీ కార్యకర్త ప్రయత్నించాడు. కానీ అది నేరుగా వచ్చి మిశ్రా తలకు తాకింది. దీంతో వికాస్ మిశ్రా తలకు గాయమైంది. 

వెంటనే ఆటను ఆపేసిన కేంద్ర మంత్రి.. మిశ్రాను ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బీజేపీ నేతలు వికాస్‌ను సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అతడి తలకు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. జ్యోతిరాదిత్య సింధియా.. మాజీ మంత్రి రాజేంద్ర శుక్లా, రేవా ఎంపీ జనార్దన్ మిశ్రాతో కలిసి ఆసుపత్రికి వెళ్లి మిశ్రాను పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానిక బీజేపీ కార్యకర్త ధీరజ్ ద్వివేది ట్విట్టర్ ద్వారా తెలిపారు.