TSRTC జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వరావు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్‌టీసీ) నూతన జాయింట్ డైరక్టర్‌గా ఐపీఎస్ అధికారిణి కె. అపూర్వ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్‌లోని తన ఛాంబర్‌లో ఆమె మంగళవారం(ఫిబ్రవరి 13) పదవీ బాధ్యతలు చేపట్టారు. టీఎస్ఆర్‌టీసీ జాయింట్ డైరెక్టర్‌గా ఒక మహిళా ఐపీఎస్ అధికారిణి నియమితులవడం ఇదే తొలిసారి.

హైదరాబాద్‌కు చెందిన అపూర్వ రావు.. 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ఆమె గతంలో వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు ఎస్‌పీగా పనిచేశారు. తనపై నమ్మకముంచి జాయింట్ డైరెక్టర్‌గా నియమించిన ప్రభుత్వానికి అపూర్వరావు గారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి(మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకం విజయవంతంగా అమలవుతోందని, ఆ పథకం మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఆమె అన్నారు. దేశ ప్రజా రవాణా వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తోన్న టీఎస్ఆర్‌టీసీ అభివృద్ధికి పాటుపడతానని ఆమె  తెలిపారు.

నిబద్ధతతో పనిచేయాలని సజ్జనార్ సూచన

టీఎస్ఆర్‌టీసీ నూతన జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె.అపూర్వరావుకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని ఆమెకు సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించి టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ఐపీఎస్ అధికారిని జాయింట్ డైరెక్టర్‌గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సజ్జనార్ గారు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం