భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్మెంట్లో 50శాతం అవకాశం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె, బ్రహ్మచారి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఆదివారం కొత్తగూడెం బస్టాండ్ ఎదుట అద్దె బస్సు డ్రైవర్లతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ దాదాపు 20 ఏండ్లకు పైగా అద్దె బస్సుల్లో చాలీచాలని జీతాలతో డ్రైవర్లుగా పనిచేస్తున్నవారికి ప్రభుత్వం రిక్రూట్మెంట్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అద్దె బస్సు డ్రైవర్లను పర్మినెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో సీఐటీయూ నాయకులు వీరన్న, భూక్యా రమేశ్, కత్తి నర్సింహారావు, లిక్కి బాలరాజు, సంజీవరావు, ఉపేశ్, సతీశ్, వీరభద్రం, రామ్చరణ్ పాల్గొన్నారు.