ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేసి, వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేండ్లుగా పదోన్నతులు, ఆరేండ్లుగా బదిలీలు లేక టీచర్లు, స్టూడెంట్లకు తీరని నష్టం జరుగుతోందన్నారు. విద్యాశాఖ వైఫల్యాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, విద్యాశాఖ కమిషనర్ నిర్లక్ష్యం కారణంగానే టీచర్ల పదోన్నతుల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని మండిపడ్డారు.
ఎన్నికల సంఘం అనుమతితో పదోన్నతులు, బదిలీల నిర్వహిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. విద్యాశాఖలో సంక్షోభానికి కారణమైన కమిషనర్ దేవసేనను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ,వైఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ బేసిక్ పే ఇవ్వాలని, గురుకుల టీచర్లపై పనిభారం తగ్గించాలని, ఆశ్రమ పాఠశాలలకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని, సీఆర్టీలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి , జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సోయం ఇందూరావు, ఉపాధ్యక్షుడు హేమంత్ షిండే, కోశాధికారి టి.రమేశ్తదితరులు పాల్గొన్నారు.