పాలమూరు పనులు 90 శాతం పూర్తి చేసినం : కె.కవిత

పాలమూరు పనులు 90 శాతం పూర్తి చేసినం : కె.కవిత

మహబూబ్‌నగర్ టౌన్, వెలుగు: పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో 90 శాతం పనులను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు తీసుకురావాలని, జాతీయ హోదా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పారు. ‘‘గత ప్రభుత్వానికి కేంద్రంతో మంచి సంబంధాలు లేకపోవడం వల్లే అనుమతులు రాలేదని సీఎం రేవంత్​రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

మోదీతో రేవంత్​రెడ్డి సత్సంబంధాలు పెట్టుకుని, కేంద్రంతో కొట్లాడి అనుమతులు సాధించాలి” అని అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌‌లోని పార్టీ ఆఫీసులో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘కృష్ణా జలాలను పాలమూరుకు కేసీఆర్ మళ్లించారు. కల్వకుర్తి, కోయిల్ సాగర్, నెట్టంపాండు, భీమా ప్రాజెక్టులు పూర్తి చేసి 11 లక్షల ఎకరాలకు సాగు నీరందించాం. జిల్లాలో అన్ని రిజర్వాయర్ల పనులు 90 శాతం పూర్తి చేశాం. మరో 10 శాతం పనులు పూర్తయి ఉంటే అదనంగా 12 లక్షల ఎకరాలకు సాగు నీరందేది” అని చెప్పారు. పాలమూరు లిఫ్ట్ స్కీమ్‌ను రద్దు చేస్తారని, మళ్లీ టెండర్లను పిలుస్తారని ప్రచారం జరుగుతున్నదని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.