లిక్కర్ స్కాం కేసులో కవిత కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం పొడిగించింది. ఈమేరకు ఆమె జూలై 18 వరకు తీహార్ జైలులోనే ఉండాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కవితను జూలై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలని జూలై 5న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత మానీలాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలతో తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ షిషోడియా కూడా ఈ కేసు విచారణలో కస్టడీలో ఉన్నారు.

లిక్కర్ స్కాం మొత్తం 1100 కోట్ల  నేరమని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జూలై 3న దాఖలు చేసిన చార్జి షీట్ లో పేర్కొంది. 292 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఉందని తెలిపింది.  లిక్కర్ పాలసీ మార్పు ద్వారా కవిత 33% భాగస్వామిగా ఉన్న ఇండో స్పిరిట్ కంపెనీ  192 కోట్ల లాభాలు పొందిందని పేర్కొన్నది. కవితకు బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లయ్ ఉన్నారని తెలిపింది. 2021–2022 లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించేందుకు గాను రూ. 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ నాయర్ ద్వారా కవిత సమకూర్చారని చార్జీ షీట్ లో పొందు పర్చింది. 

కవిత పీఏ అశోక్ కౌశిక్ ద్వారా డబ్బులు ఆప్ కు ఎలా వెళ్లాయి.. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ కు ఎన్నికోట్ల ముడుపులు సమకూర్చారు అనే అంశాలను ప్రధానంగా చార్జిషీట్ లో ప్రస్తావించారు. ఈ కేసులో ఏ1గా సమీర్ మహేంద్రు, ఏ2గా ఖావో గలీ రెస్టారెంట్, బబ్లీ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారు. ఇండో స్పిరిట్ సంస్థ ఏ3గా పేర్కొన్నారు ఈడీ అధికారులు. ఈ డీల్ మొత్తంలో ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి. ఎవరెవరు పాల్గొన్నారు..? డబ్బులను ఎలా మళ్లించారనే అంశాలను ఈడీ చార్జిషీట్ లో ప్రస్తావించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత ఏ 32 గా ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఏ 29గా ఉన్నారు.