కలగన్న రాష్ట్రాన్ని కండ్లారా చూసి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే తన ఆశ, శ్వాసగా పరితపించిన వ్యక్తి కాకా వెంకటస్వామి. సీమాంధ్ర పాలకుల చెరవీడిన తెలంగాణ రాష్ట్రాన్ని కళ్లారా చూసిన తర్వాతే ఆయన ఈలోకాన్ని వీడారు. 
విద్యార్థి దశ నుంచి పీడన, అణచివేత, ఆధిపత్యాన్ని ఎదురిస్తూ సాగిన కాకా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే కాకాతో ఉన్న సాన్నిహిత్యం సుమారు ఆరు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆయన బడుగులు, దళితులకే గాక దేశం మొత్తం కార్మిక లోకానికి నాయకత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడి, కాంగ్రెస్‌‌ పార్టీ అత్యున్నత మండలి సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఆయన సుదీర్ఘ కాలం సేవలందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా విశేష సేవలందించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన సంస్కరణల ఫలాలను ఇప్పటి తరాలు అనుభవిస్తున్నాయి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్‌‌ లీడర్‌‌గా పనిచేస్తున్నప్పుడు కాకా నన్ను అప్పటి సీఎం దామోదర సంజీవయ్య దగ్గరికి తీసుకెళ్లారు. ప్రజాజీవితంలో ఉంటూ బడుగులకు ఏ విధంగా సేవలందించాలో నాకు వివరించారు. ఆయనతో సాన్నిహిత్యం నాలో స్ఫూర్తి నింపింది. అనుక్షణం దళితులు, బడుగులు, కార్మికుల బాగు కోసం పరితపించే కాకా దేశానికే రాష్ట్రపతి కావాలని అని నేను కోరుకున్నా కానీ అది నెరవేరలేదు.

యూనియన్లు ఏర్పాటు చేయించి..
కాకా జీవితాంతం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడ్డారు. యూనియన్‌‌ నాయకుడిగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సుదీర్ఘకాలం మంత్రిగా కార్మికుల కోసం పనిచేశారు. నాగార్జునసాగర్‌‌ డ్యాం నిర్మాణంలో తమ రక్తమాంసాలను ధారబోస్తున్న కార్మికులకు కనీస వేతనం దక్కాలని ఉద్యమించారు. అక్కడి కార్మికులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి వర్కర్స్‌‌ యూనియన్‌‌ స్థాపింపజేశారు. శ్రీశైలం, శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్న కార్మికులతోనూ కాకా యూనియన్లు ఏర్పాటు చేయించారు. ప్రాజెక్టుల కోసం సర్వం ఒడ్డుతున్న కార్మికులు డేరాల్లో ఉంటుంటే చూసి చలించిపోయారు. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో 1949లో నేషనల్‌‌ హట్స్‌‌ యూనియన్‌‌ స్థాపించి ఖాళీ జాగాల్లో వారితో గుడిసెలు వేయించారు. కాకా ఆధ్వర్యంలో నిరుపేదలు 20 ఏండ్లల్లో 80 వేలకుపైగా గుడిసెలు వేసుకున్నారు. కేంద్ర కార్మిక మంత్రిగా కార్మికులకు ఆహార భద్రత కోసం రేషన్‌‌ షాపుల ద్వారా నిత్యావసరాలు ఇప్పించే ఆలోచన చేశారు.1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన కాకా మలి దశ తెలంగాణ పోరాటానికి అండగా నిలిచారు. - డాక్టర్‌‌ కె. కేశవరావు, టీఆర్‌‌ఎస్‌‌ పార్లమెంటరీ పార్టీ నేత