హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ వరంగల్ టూర్‌లో కేసీఆర్ పాల్గొనాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. ప్రజల కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తుంటే, కేసీఆర్ మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఏపీ, కేరళలో ప్రొటోకాల్ పాటిస్తూ, ప్రధాని మోదీ అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటే, కేసీఆర్ ఎందుకు అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రధాని మీద ద్వేషంతో అభివృద్ధి పనులకు దూరంగా ఉంటున్నారన్నారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణలో రూ.11,300 కోట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారని, శనివారం మరో రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కాగా, ప్రధాని మోదీ ఇంటి పేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని లక్ష్మణ్ అన్నారు. ఒక జాతిని రాహుల్ కించపరిచారని, ఓబీసీ సమాజాన్ని దూషిస్తే తగిన శాస్తి తప్పదని రుజువైందన్నారు. రాజకీయ నాయకులు విబేధాలు, విధానాలు, పని తీరు మీద విమర్శలు చేయాలే తప్ప.. కులం, జాతిని అవమానించడాన్ని ఎవరూ అంగీకరించరన్నారు. వెనుకబడిన కులం, పేదరికం నుంచి వచ్చిన మోదీ ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకే రాహుల్ గాంధీ మోదీ పేరుతో ఉన్న వారందరూ దొంగలే అని అన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయాల్లో భాష జాగ్రత్తగా ఉండాలని లక్ష్మణ్ సూచించారు. బైక్ ర్యాలీని ప్రారంభించిన లక్ష్మణ్ శనివారం వరంగల్‌లో మోదీ సభ సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి వరంగల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ తెలిపారు.