నుదుటిపై అనుభవాల ముడతలు. రెండు కనుబొమల మధ్యన తీర్చిన తిరునామం. చూడగానే చేయెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. వయసు 92 ఏళ్లు. వృత్తిరీత్యా లాయర్. కృష్ణారామా అనుకుంటూ మనవలతో కాలం గడిపే వయసు. అయినా తన చివరి కోరిక తీర్చుకోవడానికి సుప్రీం కోర్టు మెట్లెక్కారు. అయోధ్య కేసులో రామ్ లల్లా విరాజ్మాన్ తరఫున వాదించారు. ‘అయోధ్య రాముడిదే’నని సుప్రీం కోర్టుని ఒప్పించారు. తన కోరిక నెరవేరిందన్న తృప్తి ఆ వయోవృద్ధుడి ముఖంలో మెరిసింది. ఆయనే పరాశరన్.
నూట నలభై ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య కేసు పరిష్కారానికి ఆయనే దారి చూపించారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సందర్భంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనే సీనియర్ లాయర్ పరాశరన్. ఈ కేసులో రామ్ లల్లా విరాజ్మాన్ సంస్థ తరఫున లాయర్‌గా ఆయన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు ఏకబిగిన సాగిన విచారణకు ఆయన ఏ రోజూ డుమ్మా కొట్టలేదు. ఠంచన్‌గా కోర్టుకు హాజరయ్యేవారు. విచారణ సాగినంతసేపు తన వాదనలు వినిపించారు. వయసురీత్యా కూర్చుని ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి సుప్రీంకోర్టు ఆయనకు పర్మిషన్ కూడా ఇచ్చింది. అయినా పరాశరన్ కోర్టు మర్యాదల ప్రకారం నిలబడే ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. బహుశా సాక్షాత్తూ రాముడికి సంబంధించిన కేసుపై వాదనలు వినిపించేటప్పుడు కూర్చోవడానికి ఆయనకు మనస్కరించి ఉండక పోవచ్చు కూడా!
విచారణ జరిగిన అన్ని రోజులూ కోర్టు సమయానికి ఉదయం పదిన్నరకల్లా పరాశరన్ హాజరయ్యేవారు. జడ్జిలు ఆ రోజు విచారణ ముగించి, లేచి వెళ్లిపోయేవరకు కోర్టు హాలులోనే ఉండేవారు. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించినప్పుడు వాదనలు వినిపించేవారు. తన ఆర్గ్యుమెంట్స్ వినిపించడమే కాదు, సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ రాజీవ్ ధావన్ వాదనలను కూడా ఓపిగ్గా వినేవారు. వాదనల సందర్భంగా కోర్టులో ఒక్కోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడేది. రాజీవ్ ధావన్ కొన్నిసార్లు అసహనానికి గురై చేతిలో ఉన్న కాగితాలు చించేసేవారు. పరాశరన్ మాత్రం ప్రశాంతంగా కోర్టు ప్రొసీడింగ్స్‌లో పాల్గొనేవారు. ఏ రోజూ తన కోపాన్ని, అసహనాన్ని, చికాకును దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఆర్గ్యుమెంట్స్ సమయంలో ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదు.
నా చివరి కోరిక నెరవేరింది
నవంబర్ 9వ తేదీ, శనివారం… అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సిన రోజు రానే వచ్చింది. కోర్టు హాల్ అంతా కిక్కిరిసిపోయింది. పరాశరన్ ముందు వరుసలో చాలా ఆత్మవిశ్వాసంతో కూర్చున్నారు. ధర్మాసనం తరఫున చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తీర్పు చదువుతుంటే… మనసు నిశ్చలం చేసుకుని ఏకాగ్రతతో వింటున్నారు. జస్టిస్ గగోయ్ తీర్పు చదవడం ముగిసింది. కోర్టు హాలు మొత్తం పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా ఉంది. ‘అయోధ్య రాముడిదే’ అని తేల్చినట్టుగా ఉంది. ఆ తరువాతి క్షణంలో… హాలులోని లాయర్లంతా ఒక్కసారిగా పరాశరన్ దగ్గరకు వచ్చి అభినందనలతో ముంచెత్తారు. పెద్దాయనతో సెల్ఫీలు దిగడానికి పర్మిషన్ అడిగారు. ‘అయోధ్య వివాదానికి ఎండ్ కార్డు పడేలా చూడటమే నా చివరి కోరిక’ అని కేసు ప్రొసీడింగ్స్ సమయంలో పరాశరన్ కామెంట్ చేశారు. తన కోరిక నెరవేరిందన్న తృప్తి ఆయన ముఖంలో మెరిసింది.
సాయంగా యంగ్ టీం
అయోధ్య కేసులో తనకు సాయం చేయడానికి ఓ యంగ్ లాయర్ల టీం ను పరాశరన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీంలో పీవీ యోగేశ్వరన్, అనిరుద్ధ్ శర్మ, పొట్టరాజు శ్రీధర్, అదితి దాని, డీఎస్ అశ్విని కుమార్, భక్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. ఈ టీం ఎప్పటికప్పుడు ఆయనకు నోట్స్ తయారు చేసి ఇచ్చేది.
దేశ న్యాయవ్యవస్థ పితామహుడు
లాయర్ గా, జడ్జిగా పరాశరన్ ది లాంగ్ ఇన్నింగ్స్. 1958 లో లాయర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన న్యాయవ్యవస్థలోనే కొనసాగుతున్నారు. దీంతో పరాశరన్ ను దేశ న్యాయవ్యవస్థ పితామహుడిగా మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. అయోధ్య కేసు విచారణ అక్టోబరు 16న ముగిసింది. ఆరోజు సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించిన రాజీవ్ ధావన్ కోసం కోర్టు బయట పావుగంట సేపు పరాశరన్ ఎదురుచూశారు.ధావన్ వచ్చాక ఆయనతో కలిసి ఫొటో కూడా దిగారు. కోర్టు హాల్లో లాయర్లు వృత్తిపరంగా వాదులాడుకోవచ్చు కానీ, కోర్టు బయట అందరూ ఒకటేనన్న మెసేజ్ ఇచ్చినట్లయింది.
లాయర్ల కుటుంబం
పరాశరన్ సొంతూరు తమిళనాడులోని శ్రీరంగం. 1927 అక్టోబరు 9న లాయర్ల కుటుంబంలో ఆయన పుట్టారు. ఆయన తండ్రి కేశవ్ అయ్యంగార్ అప్పట్లో లీడింగ్ లాయర్. అంతేకాదు వేద పండితుడు కూడా. తండ్రి ప్రభావంతో పరాశరన్ కూడా ‘లా’ చదివారు. చదువులో ఆయన చూపిన టాలెంట్ కు ఆయనకు అనేక మెడల్స్ వచ్చాయి. 1958లో పరాశరన్ సుప్రీంకోర్టు లాయర్ గా ఎన్ రోల్ అయ్యారు. లాయర్ గా ఆయన కీలక కేసులు వాదించారు. వీటిలో శబరిమల కేసు ముఖ్యమైనది. ఈ కేసులో నాయర్ సర్వీస్ సొసైటీ తరఫున ఆయన వాదించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఆయన సమర్థించారు. అలాగే ఆయన వాదించిన కేసుల్లో సేతుసముద్రం ప్రాజెక్ట్ కేసు కూడా ఉంది. ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వాదించారు. రాముడి కాలంలోనే సముద్రంలో బ్రిడ్జి నిర్మాణం జరిగిందని పరాశరన్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు.
కీలక పదవులు
అరవై ఏళ్ల సుదీర్ఘ కాలంలో పరాశరన్ ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. 1976లో తమిళనాడు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. 1983 –89 వరకు అటార్నీ జనరల్ పదవిలో ఆయన కొనసాగారు. న్యాయ వ్యవస్థకు అందించిన కంట్రిబ్యూషన్ కు గాను అనేక అవార్డులు ఆయనకు దక్కాయి. 2003లో పద్మ భూషణ్ అవార్డు 2011లో పద్మ విభూషణ్ అవార్డులు పరాశరన్ కు లభించాయి. 2012 జూన్ లో ఆయన రాజ్యసభ కు నామినేట్ అయ్యారు.
పరాశరన్ కు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ. పరాశరన్ తన వాదనల్లో హిందూ ధర్మానికి సంబంధించిన అనేక సూక్తులను అలవోకగా ఉదహరించే వారు. ఇది అయోధ్య కేసుకే పరిమితం కాదు. అయన వాదనలు వినిపించిన ఏ కేసులోనైనా ఇది మామూలే. దీంతో పరాశరన్ వాదనలు వినడానికి తోటి లాయర్లు ఆసక్తి చూపేవారు. హిందూ ధర్మం పై ఆయనకున్న పట్టును చూసి ఆశ్చర్యపోయేవారు.
మందిర నిర్మాణానికి సంఘ్ భరోసా
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మర్నాడు అంటే ఈనెల 10న నాగ్ పూర్ వెళ్లి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో సమావేశమయ్యారు. చాలా తక్కువ టైమ్ లోనే రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా పరాశరన్ కు మోహన్ భగవత్ భరోసా ఇచ్చారు. గుడి నిర్మాణం కోసం అయోధ్యలోని కర్ సేవక్ పురంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ప్రస్తావన కూడా వీరిద్దరి మాటల్లో వచ్చినట్లు తెలిసింది. భగవత్ లో సమావేశానికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదని, మర్యాదపూర్వకంగానే ఆయనను కలుసుకున్నట్లు పరాశరన్ చెప్పారు.