ముషీరాబాద్, వెలుగు: కవిత్వం సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి అన్నారు. బుధవారం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్ లో ‘ఇక్బాల్ కవిత్వం కళ చెదరని స్వప్నం’ అనే పుస్తకాన్ని శివారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ ఆవిష్కరించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ.. కవులు నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తారని కొనియాడారు. హర గోపాల్ మాట్లాడుతూ కవిత్వం ప్రజల్లో చైతన్యాన్ని నింపడమే కాకుండా పాలకవర్గాలను ప్రశ్నిస్తుందని చెప్పారు. సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం అక్షరం ఆయుధంగా మలచాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు.
ఉత్సాహంగా ‘బుక్ వాక్’
పుస్తక పఠనం ప్రాముఖ్యతను తెలియజేసేలా లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయం నుంచి బుక్ ఫెయిర్ వరకు పుస్తక ప్రియులు బుధవారం ‘బుక్ వాక్’ నిర్వహించారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, జూనియర్ గౌరీ శంకర్ తో పాటు స్టూడెంట్లు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఆర్ఓ వనం జ్వాల నరసింహారావు, ప్రజా వాగ్గేయకారుడు జయరాజ్, విమలక్క, జన విజ్ఞాన దర్శిని రమేశ్, అఖిల భారత రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి తదితర ప్రముఖులు బుక్ ఫెయిర్ ను సందర్శించారు.