
సిద్దిపేట, వెలుగు: కవిత్వానికి జీవితమే పునాదని కేంద్ర సాహిత్య ఆకాడమీ అవార్డు గ్రహీత కె. శివారెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు రంగాచారి అధ్యక్షతన కవి తైదల అంజయ్య వచన కవితా సంపుటి " జలతంత్రి " ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు.. తైదల అంజయ్య 30 ఏండ్ల సామాజిక పరిస్థితులను, తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలను, అణిచివేతలు, కుల వివక్ష పై అద్భుతమైన కవిత్వం రాసి రికార్డు చేశాడన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో జరిగిన ప్రజా విముక్తి పోరాటాలు, ప్రజల పై జరిగిన అణిచివేత ఎంతో మంది కవులకు ప్రేరణ నిచ్చాయన్నారు. నాలుగు దశా బ్దాలుగా మంజీరా రచయితల సంఘం తో సిద్దిపేట ప్రాంతం తో తనకు అనుబంధం ఉందన్నారు. సభలో శాసన మండలి సభ్యుడు, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ , నందిని సిధారెడ్డి, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, దేవీ ప్రసాద్, పాపయ్య, తిరుపతి రెడ్డి, అంజయ్య, శివకుమార్, బాలయ్య, మరసం ప్రధాన కార్యదర్శి యాదగిరి, అశోక్, ప్రముఖ గాయని విజయ, గాయకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.