- ఆయనను 30 వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు
- ఏసీబీ, దానకిశోర్‌కు నోటీసులు.. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం
- తదుపరి విచారణ 27కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసులో జరిగిన అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, దానికి కేటీఆర్ సహకరించాలని ఆదేశించింది. తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను ఏసీబీకి అందజేయాలని కేటీఆర్‌కు సూచించింది.
ఎఫ్‌ఐఆర్‌లో కొన్ని ప్రాథమిక అంశాలు లోపించాయి. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉంది. అందువల్ల విచక్షణాధికారంతో సీఆర్‌పీసీ 482 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నం” అని కోర్టు పేర్కొంది. ప్రతివాదులైన ఏసీబీ, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేస్తూ.. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు.
రాజకీయ కక్షతోనే కేసు: పిటిషనర్ లాయర్
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం వాదిస్తూ.. రాజకీయ, వ్యక్తిగత కక్షసాధింపుల్లో భాగంగానే కేటీఆర్ పై కేసు పెట్టారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్టు అర్థమవుతుందన్నారు. ‘‘ఈ నెల 18న ఫిర్యాదు అందితే, ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే 19న కేసు నమోదు చేశారు. ఇందులో పిటిషనర్ ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఎలాంటి ఆరోపణలు లేవు. అంతేగాకుండా రేసు వల్ల రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఫార్ములా–ఈ రేసు కోసం ప్రభుత్వం, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ కంపెనీ, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది.
Also Read :- భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
అయితే ఆ తర్వాత ప్రమోటర్ తప్పుకోవడంతో ప్రభుత్వమే చెల్లింపులు చేసింది. నిర్వహణ కంపెనీకి చెల్లింపులు జరిపేందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదని 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధం. ఎన్నికల కోడ్ కు ముందే జరిగిన ఒప్పందానికి ఎన్నికల ప్రవర్తనా నియామవళి వర్తించదు. కుట్ర పన్నారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కానీ నిర్వాహకులను మాత్రం నిందితులుగా చేర్చలేదు. ఇది కేవలం సివిల్ వివాదం. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలి” అని కోరారు.
ఒప్పందానికి ముందే చెల్లింపులు: ఏజీ సుదర్శన్ రెడ్డి
ఒప్పందానికి ముందే చెల్లింపులు జరిగాయని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ‘‘2023 అక్టోబర్ 30న ఒప్పందం కుదిరింది. కానీ చెల్లింపులు మాత్రం అక్టోబరు 3, 11న జరిగాయి. రెండు విడతలుగా రూ.54.88 కోట్లు చెల్లించారు. దీనికి అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి14 కోట్ల అదనపు భారం పడింది. రూ.10 కోట్లకు మించి చెల్లింపులు జరపాలంటే ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. విదేశీ కంపెనీకి చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. కానీ ఇవేవీ లేకుండానే చెల్లింపులు చేశారు.
ఈ రేసు ద్వారా లాభాలు స్పాన్సర్‌కు వచ్చాయి.. ప్రభుత్వానికి కాదు. ఎఫ్‌ఐఆర్ దాఖలైన వెంటనే కేసును కొట్టివేయాలని కోరడం సరికాదు. ముందస్తు బెయిల్ కావాలంటే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. దర్యాప్తుకు ముందే అన్ని అంశాలను పేర్కొనడానికి ఎఫ్‌ఐఆర్ ఎన్‌సైక్లోపీడియా కాదు. దర్యాప్తు టైమ్ లో వెల్లడయ్యే అంశాల ఆధారంగా నిందితులను చేర్చడం, తొలగించడం జరుగుతుంది. కేసు నమోదులో ఎలాంటి రాజకీయ, వ్యక్తిగత కక్షసాధింపు లేదు. ప్రాథమిక విచారణ తర్వాత అక్టోబర్ 18న ప్రభుత్వానికి నివేదిక అందింది. అనంతరం కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తీసుకున్నాం” అని వివరించారు. కౌంటర్ దాఖలయ్యేదాకా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.