కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1980, ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైన ‘శంకరాభరణం’ మూవీ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు సినీ చరిత్రలో ‘శంకరాభరణం’ ఒక ఆణిముత్యం అని చెప్పాలి. ఈ సినిమాతో కె. విశ్వనాథ్ కళాతపస్విగా పేరొందారు. ‘శంకరాభరణం’ సినిమా దేశ వ్యాప్తంగా శాస్త్రీయ సంగీత అభిమానుల ప్రశంసలు పొందింది. ఆ సినిమా విడుదలైన రోజే కళాతపస్వి శివైక్యం పొందడం బాధాకరం.
ఈ సినిమాకు కేవీ మహాదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కమర్షియల్ హంగులు లేకున్నా గొప్ప విజయం సాధించింది. పెద్దగా పేరు ప్రఖ్యాతలు లేని నటీ నటులతో తీసిన ‘శంకరాభరణం’ మూవీ అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే ఈ సినిమా ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాలోని శంకరా.. నాదశరీరా పరా.. అనే పాట సంగీత ప్రియుల మనసులను దోచుకుంది. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ పాటకు ప్రాణం ఉంటుంది. ఈ పాట తెలుగు ఖ్యాతిని కూడా మరింత పెంచింది. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినా ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లో శంకరాభరణంది ఎప్పటికీ చెక్కుచెదరని స్థానం. శంకరా నాదశరీరాపరా పాటను వేటూరి సుందర రామమూర్తి రాశారు. ఈ పాటకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా వేటూరికి నంది అవార్డు వచ్చింది. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు.
శంకరాభరణం ఉత్తమ సినిమాగా నంది అవార్డును సొంతం చేసుకోవడమే కాదు.. జాతీయ అవార్డు కూడా పొందింది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్’ విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది.
‘రారా కృష్ణయ్య’ సినిమాలో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులుని శంకరశాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. మంజు భార్గవి కూడా అప్పటికి పెద్ద పేరున్న నటి కాదు. అయినా సినిమా విడుదలైన తర్వాత విశ్వనాథ్‌కు జేజేలు పలికారు.