ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (93) ఇక లేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1966లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్.. సిరిసిరిమువ్వ, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతికిరణం, సప్తపది, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. ఆయన ప్రతి సినిమాలో సంస్కృతి సంప్రదాయాలకు, కళలకు పెద్దపీట వేశారు. ఎన్నో చిత్రాల్లో నటించారు.
సినీ స్వాతిముత్యం
శంకరాభరణం.. సాగర సంగమం.. స్వాతిముత్యం.. సిరివెన్నెల.. ఒకటా రెండా ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకు అందించిన కళాతపస్వి ఆయన. పాశ్చాత్య హోరులో కొట్టుమిట్టాడుతున్న సినిమా లోకానికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అద్దిన దర్శక యశస్వి ఆయన. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇక సెలవు తీసుకున్నారు.
గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రులో 1930 ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జన్మించారు. గుంటూరులో బీఎస్సీ వరకు చదువుకున్నారు. 1957లో వచ్చిన ‘తోడికోడళ్లు’ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘మూగమనసులు’, ‘ఇద్దరుమిత్రులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి పలు సినిమాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాలన్నింటిలో అక్కినేని నాగేశ్వరరావు హీరో. అలా అక్కినేనితో ఏర్పడిన పరిచయం కాస్త.. దర్శకుడిగా అవకాశం కల్పించింది. ఏఎన్నార్, కాంచన హీరోహీరోయిన్‌గా 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాను విశ్వనాథ్ తెరకెక్కించారు.
కళాతపస్విగా..
మొదట్లో కొన్ని కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన విశ్వనాథ్.. ఆ తర్వాత సంస్కృతీ సంప్రదాయాలనే ఇతివృత్తంగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. అలా వచ్చిన మొదటి చిత్రం ‘చెల్లెలి కాపురం’. ఇందులో శోభన్‌బాబు, వాణిశ్రీ, శారద ప్రధాన పాత్రలు పోషించారు. అందాల హీరోగా పేరున్న శోభన్‌బాబుతో డీగ్లామర్రోల్ చేయించి.. ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ తీసిన ‘శారద’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వరుసగా సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సీతామాలక్ష్మి, సాగరసంగమం, సప్తపది, స్వాతిముత్యం, సిరివెన్నెల, శుభలేఖ, స్వయం కృషి, సూత్రదారులు, శుభసంకల్పం.. వంటి ఎన్నో చిత్రాలను తీశారు. ప్రతి చిత్రంలో సంస్కృతీ సంప్రదాయాలు, భారతీయ కళలకు పెద్దపీట వేశారు. పాశ్చాత్య సంగీత హోరులో కొట్టుమిట్టాడుతున్న సినిమా లోకానికి విశ్వనాథ్ తన సినిమాల ద్వారా భారతీయ సంగీత సాహిత్య కళల మాధుర్యాన్ని పంచారు. అలా ఆయనకు ‘కళాతపస్వి’గా గుర్తింపు లభించింది. శంకరాభరణం సినిమాను చూసి ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కె.విశ్వనాథ్ సినిమాల్లోని పాటలు ఎవర్ గ్రీన్. తాను తీసిన సినిమాలను హిందీలోకి కూడా విశ్వనాథ్ రీమేక్ చేసి విజయాలను అందుకున్నారు. అందులో ‘సిరిసిరిమువ్వ’ను ‘సర్గమ్’గా, ‘శుభోదయం’ చిత్రాన్ని ‘కామ్‌చోర్’ గా, ‘శంకరాభరణం’ సినిమాను ‘సుర్ సంగమ్’గా తీశారు. 80ఏండ్ల వయసులోనూ ‘శుభప్రదం’ లాంటి సినిమాను కె.విశ్వనాథ్ తెరకెక్కించారు. ఆయన తీసిన సినిమాల్లో చాలా వాటికి ‘ఎస్’తోనే పేరు మొదలవుతుంది. విశ్వనాథ్ దర్శకత్వం వహించేటప్పుడు ఖాకీ దుస్తుల్లో ఉండేవారు. ఎందరో రచయితలను, నటులను వెండితెరకు పరిచయం చేశారు.
నటుడిగాను ప్రత్యేక గుర్తింపు
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కె.విశ్వనాథ్ మెప్పించారు. శుభసంకల్పం, లాహిరి లాహిరి లాహిరిలో, సంతోషం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నీ స్నేహం, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి చిత్రాల్లో ఆయన నటించారు.
వరించిన పురస్కారాలెన్నో..
విశ్వనాథ్ తీసిన శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం దక్కింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 1992లో పద్మశ్రీ పురస్కారం, 2016 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనను వరించాయి.